English | Telugu

ఆ విషయంలో ఇళయరాజాతో పెట్టుకుంటే టార్చర్‌ మామూలుగా ఉండదుగా!

ఇప్పటి ఆధునిక యుగంలో బయోపిక్‌ల ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రస్తుతం ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తుల జీవితాల్లోని వెలుగు నీడల్ని తెలియజేసేవి, వారు ఈ స్థాయికి రావడానికి పడిన శ్రమ.. వీటన్నింటినీ ఆవిష్కరించేవి బయోపిక్‌లు. వారి జీవితాల్ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని యువత ముందుకెళ్ళే అవకాశం ఉంది, విజయాలు సాధించే వీలు కూడా ఉంది. ఇప్పటివరకు చాలా రంగాల్లోని ప్రముఖుల జీవిత చరిత్రలతో కూడిన బయోపిక్‌లు వచ్చాయి. అయితే వాటిలో కొన్ని విజయాలు సాధిస్తే, మరికొన్ని అపజయాల్ని మూట కట్టుకున్నాయి.

ఇప్పుడున్న ప్రముఖుల్లో బయోపిక్‌లకు అర్హులైన వారు చాలా మందే వున్నారు. వారిలో ఇళయరాజా ఒకరు. సంగీత ప్రపంచంలో దిగ్గజంగా చెప్పుకోదగ్గ వ్యక్తి ఇళయరాజా. సినీ సంగీతాన్ని కొత్త పుంతలు తొక్కించి, కొత్త తరహా సంగీతంతో  శ్రోతల్ని సంగీత సముద్రంలో ఓలలాడిరచిన సంగీత జ్ఞాని. అలాంటి సంగీత గని బయోపిక్‌ చెయ్యడం అంటే మామూలు విషయమా? అందునా వ్యక్తిగతంగా ఇళయరాజా ఎలా వుంటారో, ఎంత కఠినంగా వ్యవహరిస్తారో ఆయన గురించి అవగాహన ఉన్నవారికి తెలుసు. ముఖ్యంగా ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో ఎంతో ఖచ్చితంగా ఉండే ఆయనతో బయోపిక్‌ చెయ్యడం కత్తిమీద సాములాంటిదే. గతంలో ఇళయారాజా, ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం సొంత అన్నదమ్ముల్లా మెలిగేవారు. ఒకరినొకరు ఒరేయ్‌ అని పిలుచుకునే చనువు వుంది. అలాంటిది ఒక సందర్భంలో బాలుపై కేసు వేసి కోర్టుకెళ్ళారు ఇళయరాజా. ఆయన స్వరపరిచిన ఎన్నో సూపర్‌హిట్‌ పాటల్ని బాలు ఆలపించిన విషయం తెలిసిందే. వాటినే కొన్ని సంగీత కచ్చేరిలలో పాడి సొమ్ము చేసుకుంటున్నాడని గ్రహించిన ఇళయారాజా ఆ కార్యక్రమాల వల్ల వచ్చే డబ్బులో తనకు రాయల్టీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆ విషయాన్ని బాలు అంతగా పట్టించుకోకపోవడంతో ఇళయరాజా కోర్టుకు వెళ్ళి మరీ ఆ రాయల్టీ సొమ్మును పొందారు.

అలాంటి ఇళయరాజాతో బయోపిక్‌ తీస్తే బాగుంటుందని భావించిన ఓ దర్శకనిర్మాత ఈ ప్రపోజల్‌ను ఆయన ముందుంచారట. ఆ బయోపిక్‌ తియ్యడానికి తనకు రాయల్టీ ఇవ్వాలని ఇళయరాజా కోరినట్టు తెలిసింది. ఆయన రాయల్టీ కింద చెప్పిన ఫిగర్‌ను చూసి షాక్‌ తిన్న ఆ దర్శకనిర్మాత మారు మాట్లాడకుండా వెనుదిరిగాడట. అలాంటి విలక్షణమైన మనస్తత్వం కలిగిన వ్యక్తి బయోపిక్‌ చెయ్యడమంటే టార్చర్‌ మామూలుగా ఉండదుగా. అందుకే సదరు దర్శకనిర్మాత ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నట్టు తెలిసింది. నిజానికి ఇళయరాజా వంటి ప్రముఖుడి బయోపిక్‌కి ఎంతో డిమాండ్‌ ఉంటుంది. దానికి తగ్గ రాబడి కూడా ఉంటుంది. కానీ, దాన్ని చెయ్యడానికి ఎంతో ఓపిక, మనోధైర్యం ఉండాలి. ఇన్ని క్వాలిటీస్‌ ఉన్న దర్శకనిర్మాత ముందుకొస్తే ఒక గొప్ప బయోపిక్‌ని చూసే అవకాశం ప్రేక్షకులకు కలుగుతుంది.