English | Telugu

కృతిశెట్టికి జరిగిందే.. శ్రీలీల విషయంలోనూ రిపీట్‌ అవుతుందా?

సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ మంది రెండు విషయాలను గాఢంగా నమ్ముతారు. అది దైవం, అదృష్టం. ఎంత టాలెంట్‌ ఉన్నా అదృష్టం కలిసి రావాలని, దానికి దైవానుగ్రహం కూడా ఉండాలని భావిస్తుంటారు. ముఖ్యంగా హీరోయిన్ల విషయానికి వస్తే అందం, అభినయం ఉంటే సరిపోదు.. అదృష్టం కూడా ఉండాలనే విషయంతో ఎక్కువ మంది ఏకీభవిస్తారు. కొందరికి ఒక్క సినిమాతోనే కలిసొస్తే.. మరికొందరికి ఎన్ని సినిమాలు చేసినా అదృష్టం తలుపు తట్టదు. మరి కొంతమంది అవకాశాలు అందిపుచ్చుకుంటారు. అయితే సినిమాల ఎంపికలో చేసే తప్పిదాల వల్ల ఆఫర్స్‌ తగ్గి కనుమరుగవుతుంటారు. ఈమధ్యకాలంలో అలాంటి వారి గురించి చెప్పాలంటే కృతిశెట్టిని ఉదాహరణగా తీసుకోవచ్చు. వైష్ణవ్‌తేజ్‌ హీరోగా వచ్చిన ‘ఉప్పెన’ చిత్రంతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా పరిచయమైన కృతిశెట్టి మొదటి సినిమాతోనే సూపర్‌హిట్‌ కొట్టి మంచి పేరుతోపాటు, అవకాశాలు కూడా రాబట్టుకుంది. అయితే వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న ఉద్దేశంతో ప్రతి ఆఫర్‌ని మరో ఆలోచన లేకుండా కమిట్‌ అయింది. వరస సినిమాలతో బిజీ అయిపోయింది. అయితే ఆమె హీరోయిన్‌గా నటించిన సినిమాలు వరసగా ఫ్లాప్‌ అవుతూ ఉండడం వల్ల ఒక్కసారిగా కృతి క్రేజ్‌ తగ్గిపోయింది. తెలుగులో ప్రస్తుతం కృతిశెట్టి చేస్తున్న సినిమా ఏది అంటే తడుముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇప్పుడదే తప్పు హీరోయిన్‌ శ్రీలీల కూడా చేస్తోందని ఆమె కమిట్‌ అవుతున్న సినిమాలను బట్టి అర్థమవుతోంది. పెళ్లి సందడి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు శ్రీలీల పరిచయం అయింది. రాఘవేంద్రరావు హీరోయిన్‌ అంటూ ముద్ర పడటంతో మొదటి సినిమా నిరాశ పరిచినా ఈమెకు ఆఫర్లు మాత్రం బాగానే వచ్చాయి. ఆ తర్వాత ధమాకా చిత్రంతో శ్రీలీల మొదటి విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో వరసగా ఆమెకు అవకాశాలు వచ్చాయి. అదీ, ఇదీ అని కాకుండా వచ్చిన ప్రతి ఆఫర్‌నూ ఒప్పుకుంటూ లెక్కకు మించిన సినిమాలు చేస్తోంది. అయితే సినిమాల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఆమెను విజయాలు వరించడం లేదు. స్కంద, ఆదికేశవ వంటి సినిమాలు ఆమెను వెనక్కి లాగాయి. అయితే భగవంత్‌ కేసరిలో చేసిన క్యారెక్టర్‌ మాత్రం ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. సినిమా సూపర్‌హిట్‌ అవ్వడంతో ఆమెకు కాస్త ఊరటనిచ్చింది. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌ కాదు కాబట్టి దాన్ని వేరే కేటగిరి కింద చూడాల్సి వస్తుంది. ఇప్పుడు నితిన్‌ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందిన ‘ఎక్స్‌ట్రా’ సినిమాపైనే శ్రీలీల ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా హిట్‌ అయితేనే హీరోయిన్‌గా ఆమెకు మనుగడ ఉంటుందని టాలీవుడ్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఎందుకంటే నితిన్‌కి ఈమధ్య కాలంలో హిట్‌ అనేది లేదు. అలాగే దర్శకుడు వక్కంతం వంశీకి దర్శకుడుగా ఇది రెండో సినిమా. అల్లు అర్జున్‌తో చేసిన మొదటి సినిమా నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే డిజాస్టర్‌ మూవీ చేశాడు వంశీ. ఇలా హిట్స్‌లేని హీరో, దర్శకుడి సినిమా ఒప్పుకోవడం ఆమె చేసిన తప్పు అని కొందరి అభిప్రాయం. 

మహేష్‌ బాబు, పవన్‌ కళ్యాణ్‌ వంటి స్టార్‌ హీరోల సినిమాల్లో అవకాశాలు వస్తున్నప్పటికీ ఓ రేంజ్‌ హీరోల సినిమాలను కూడా కాదనకుండా చెయ్యడం అనేది కరెక్ట్‌ కాదనే వాదన వినిపిస్తోంది. మహేష్‌బాబు హీరోగా రూపొందుతున్న గుంటూరు కారం, పవన్‌ కళ్యాణ్‌ హీరోగా చేస్తున్న ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ చిత్రాల్లో శ్రీలీల హీరోయిన్‌. అలాంటి టాప్‌ హీరోలు, టాప్‌ డైరెక్టర్ల సినిమాల్లో నటిస్తేనే శ్రీలీలకు హీరోయిన్‌గా మంచి భవ్యిష్యత్తు ఉంటుంది. లేకపోతే కృతిశెట్టిలాగే కొన్ని సినిమాలతోనే డౌన్‌ఫాల్‌ మొదలయ్యే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.