English | Telugu

నందమూరి బాలకృష్ణ, అల్లు అర్జున్‌.. బోయపాటి నెక్స్‌ట్‌ సినిమా?

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో సినిమా అంటే ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఎంత క్రేజ్‌ ఉంటుందో అందరికీ తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన  ‘సింహా’, ‘లెజెండ్‌’, ‘అఖండ’ చిత్రాలు ఒకదాన్ని మించి ఒకటి ఘనవిజయం సాధించాయి. నందమూరి బాలకృష్ణ హీరో ఇమేజ్‌ తారాస్థాయికి చేరుకోవడానికి ఈ మూడు సినిమాలు బాగా ఉపయోగపడ్డాయి. అయితే ఇటీవల రామ్‌తో బోయపాటి చేసిన ‘స్కంద’ ఊహించని విధంగా డిజాస్టర్‌ అయింది. దీంతో బోయపాటితో సినిమాలు చేసేందుకు హీరోలు ఎవరూ ముందుకు రావడం లేదన్న టాక్‌ ఆమధ్య వినిపించింది. ‘అఖండ’ టైమ్‌లో దానికి సీక్వెల్‌గా ‘అఖండ2’ ఉంటుందని ప్రకటించాడు బోయపాటి. ‘స్కంద’ అందర్నీ నిరాశపరచడంతో ‘అఖండ2’ ప్రాజెక్ట్‌ ఉండదని బాగా ప్రచారం జరిగింది. అలాగే అల్లు అర్జున్‌తో ‘సరైనోడు’ వంటి బ్లాక్‌బస్టర్‌ ఇచ్చిన బోయపాటితో మళ్ళీ సినిమా చెయ్యాల్సి ఉన్నప్పటికీ స్కంద ఎఫెక్ట్‌తో బన్ని అతనితో సినిమా చేసేందుకు సుముఖంగా లేడనే వార్త కూడా బాగా స్ప్రెడ్‌ అయింది. 

తాజా సమాచారం మేరకు.. ‘అఖండ2’, బోయపాటి, బన్ని కాంబినేషన్‌లో సినిమాలు ఉంటాయని వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే బాలకృష్ణ కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా ‘అఖండ’ నిలిచింది. మాస్‌, యాక్షన్‌ను లింక్‌ చేస్తూ ఫ్యామిలీ డ్రామాను నడిపించడంలో బోయపాటికి మంచి పేరు ఉంది. దానికి తోడు ఈ కథలో దైవశక్తిని కూడా యాడ్‌ చేయడం ‘అఖండ’ భారీ విజయానికి కారణమైంది. ఈ సినిమాలోని ప్రధాన అంశాన్ని తీసుకొని సీక్వెల్‌ను ప్లాన్‌ చేస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం బోయపాటి ఈ సినిమా స్క్రిప్ట్‌ వర్క్‌లో బిజీగా ఉన్నాడని సమాచారం. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పూర్తయిన తర్వాత ‘అఖండ2’ షూటింగ్‌కి వెళ్లాలని బోయపాటి ప్లాన్‌ చేసుకుంటున్నాడు. ఈ సినిమాను స్టార్ట్‌ కావడం ఆలస్యమైతే బన్నితో సినిమా స్టార్ట్‌ చెయ్యాలని చూస్తున్నాడు బోయపాటి. ఇప్పటికే ఈ సినిమా కథ కూడా ఓకే అయింది. అయితే బాబీ డైరెక్షన్‌లో బాలకృష్ణ చేస్తున్న సినిమా షూటింగ్‌ పూర్తయ్యే దాన్ని బట్టే బోయపాటి నెక్స్‌ట్‌ చేయబోయే సినిమా ఉంటుందని తెలుస్తోంది.