English | Telugu

‘గుంటూరు కారం’ చిత్రానికి సంబంధించి మరో రూమర్‌ వైరల్‌!

ఒక భారీ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్‌డేట్‌ వచ్చినా అది సెన్సేషనే. అందులోనూ సూపర్‌స్టార్‌ మహేష్‌ నటిస్తున్న సినిమా అంటే వేరే చెప్పాలా? ఈమధ్య కాలంలో ‘గుంటూరు కారం’ చిత్రానికి వచ్చినన్ని అప్‌డేట్స్‌, రూమర్స్‌ ఏ సినిమాకీ రాలేదు. ఈ సినిమా నుంచి ఒక్కొక్కరు తప్పుకుంటున్నారని, హీరోయిన్‌ పూజా హెగ్డే, సినిమాటోగ్రాఫర్‌ మార్పు వంటి విషయాలతో ఈ సినిమా వార్తల్లో నిలిచింది. 
తాజాగా ఈ సినిమాకి సంబంధించిన మరో రూమర్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలోని ఒక పాట లీక్‌ అయిందన్నదే ఆ వార్త. సగానికిపైగా ఉన్న ఈ పాట థమన్‌ సంగీతంతో ఉందని, పైగా పాటలో స్టార్‌ సూపర్‌స్టార్‌ అనే పదాలు ఉండడంతో ఇది ఖచ్చితంగా గుంటూరు కారం చిత్రంలోని పాటకు సంబంధించినదే అని అందరూ భావిస్తున్నారు. మరికొందరు ఇది వాయిదా ఒక పాన్‌ ఇండియా సినిమాకి సంబంధించిన పాట అని అనుకుంటున్నారు. మరి వాయిదా పడిన ఆ సినిమా ఏమిటో తెలియాల్సి ఉంది.
‘గుంటూరు కారం’ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈమధ్యే కోటిలోని ఉమెన్స్‌ కాలేజీలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఇప్పుడు మహేష్‌, ప్రకాష్‌రాజ్‌ కాంబినేషన్‌లో సీన్స్‌ షూట్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి మరో హీరోయిన్‌గా కనిపించనుంది. హారిక, హాసిని క్రియేషన్స్‌ పతాకంపై త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాని ఎస్‌.రాధాకృష్ణ, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.