English | Telugu

‘గుంటూరు కారం’ మూవీ నుంచి మ‌రొక‌రు ఔట్‌?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ తాజా చిత్రం ‘గుంటూరు కారం’. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా కోసం ఇటు ఫ్యాన్స్ ప్రేక్ష‌కుల‌తో పాటు ట్రేడ్ వ‌ర్గాలు కూడా ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాయి. ఇది వ‌ర‌కు వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన అత‌డు, ఖ‌లేజా సినిమాలు ఆశించిన స్థాయిలో సిల్వ‌ర్ స్క్రీన్‌పై హిట్ కాలేదు. కానీ బుల్లి తెర‌పై మాత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీస్‌గా నిలిచాయి. కానీ ఈసారి త్రివిమ్ర్ ఎలాగైనా భారీ హిట్ కొట్టాల‌ని అడుగులు వేస్తున్నారు. అయితే ఈ సినిమాను ఏ ముహూర్తాన స్టార్ట్ చేశారో తెలియ‌దు కానీ.. సినిమా మాత్రం స్పీడుగా సాగ‌టం లేదు. మ‌రో వైపు వ‌చ్చే ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా ‘గుంటూరు కారం’ను జ‌న‌వ‌రి 12న విడుద‌ల చేస్తామ‌ని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఇప్పుడు సాగుతున్న‌ట్లు న‌త్త‌న‌డ‌క‌లా సినిమా సాగితే సినిమా అనౌన్స్ చేసిన డేట్‌కు వ‌స్తుందా? అని కూడా అంద‌రూ ఆలోచిస్తున్నారు.

మ‌రో వైపు ‘గుంటూరు కారం’ నుంచి అప్‌డేట్స్ కోసం అభిమానులు ఆతృత‌గా వెయిట్ చేస్తున్నారు. అప్‌డేట్స్ వ‌స్తున్నాయో లేదో కానీ.. మూవీ నుంచి ఒక్కొక్క‌రుగా బ‌య‌ట‌కు వెళ్లిపోతున్నారంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. ముందుగా ఫైట్ మాస్ట‌ర్స్ అన్బ‌రివులను మ‌హేష్ ప‌ట్టుబ‌ట్టి మార్చేశారు. ఆ పిమ్మ‌ట మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్ బ‌య‌ట‌కు వ‌చ్చేశాడ‌ని ముందు న్యూస్ వ‌చ్చింది. కానీ నిర్మాత‌లు ఆ వార్త‌ల‌ను ఖండించారు. త‌ర్వాత పూజా హెగ్డే  బ‌య‌ట‌కు వెళ్లిపోయింది. త‌ర్వాత సినిమాటోగ్రాఫ‌ర్ పి.ఎస్‌.వినోద్ వెళ్లిపోయారు. తాజాగా ఈ లిస్టులో మ‌రొక‌రు చేరార‌ని లేటెస్ట్‌గా న్యూస్ చ‌క్క‌ర్లు కొడుతుంది. అదెవ‌రో కాదు.. ఫైట్ మాస్ట‌ర్స్ రామ్ ల‌క్ష్మ‌ణ్‌. అందుకు కార‌ణాలు మాత్రం తెలియ‌టం లేదు.

ఈ నేప‌థ్యంలో ఆగ‌స్ట్ 16 నుంచి ‘గుంటూరు కారం’ రెగ్యుల‌ర్ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు మేక‌ర్స్‌. దీనికి సంబంధించి నాలుగు కోట్లు ఖ‌ర్చు పెట్టి ఇంటి సెట్‌ను వేశారు. శ్రీలీల‌, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.