English | Telugu

శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్.. కొత్త మీమ్స్ రెడీ చేసుకోండి!

దర్శకుడు శ్రీను వైట్ల కమ్ బ్యాక్ ఇవ్వాలని కోరుకునేవారు ఎందరో ఉన్నారు. ఆయన సినిమాల్లోని ఎన్నో కామెడీ సన్నివేశాలు ఇప్పటికీ నవ్విస్తుంటాయి. సోషల్ మీడియాలో మీమ్స్ గా వచ్చే వాటిలో సగానికి పైగా ఆయన సినిమాల్లోని సన్నివేశాలే ఉంటాయి. అలాంటి శ్రీను వైట్ల నుంచి సరైన ఎంటర్టైనర్ వచ్చి పదేళ్లు అవుతుంది. ఆయన మెగాఫోన్ పట్టి ఐదేళ్లు అవుతుంది. అందుకే మంచి ఎంటర్టైనర్ తో శ్రీను వైట్ల కమ్ బ్యాక్ ఇవ్వాలని కామెడీ లవర్స్ కోరుకుంటున్నారు. అయితే ఎట్టకేలకు శ్రీనువైట్ల కొత్త సినిమా ఓకే అయిందని తెలుస్తోంది.

'ఆనందం', 'సొంతం', 'వెంకీ', 'ఢీ', 'దుబాయ్ శీను', 'రెడీ', 'దూకుడు' వంటి ఎంటర్టైనర్స్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శ్రీను వైట్ల కొంతకాలంగా దూకుడు తగ్గించాడు. 2013 లో వచ్చిన 'బాద్‍షా' తర్వాత ఆయన హిట్ చూడలేదు. ఈ పదేళ్లలో కేవలం నాలుగు సినిమాలు మాత్రమే తీసి, ఒక్క విజయాన్ని కూడా అందుకోలేకపోయిన ఆయన రేసులో బాగా వెనకబడిపోయాడు. చివరిగా ఆయన దర్శకత్వంలో 'అమర్ అక్బర్ ఆంటోని'(2018) అనే సినిమా వచ్చింది. ఆ తర్వాత 'ఢీ' సినిమాకి సీక్వెల్ చేయాలని అనుకున్నా ఎందుకనో అది సాధ్యం కాలేదు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో ఓ సినిమా ఉంటుందని ఆ మధ్య వార్తలొచ్చినా ఆ తర్వాత దాని గురించి ఎలాంటి అప్డేట్ లేదు. అయితే ఇప్పుడు మ్యాచో స్టార్ గోపీచంద్ పేరు తెరపైకి వచ్చింది.

2014 లో వచ్చిన 'లౌక్యం' తర్వాత ఆశించిన స్థాయిలో గోపీచంద్ విజయాలను అందుకోలేకపోయాడు. ముఖ్యంగా ఆయన గత చిత్రాలు 'పక్కా కమర్షియల్', 'రామబాణం' దారుణంగా నిరాశపరిచాయి. సరైన విజయం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న గోపీచంద్ ప్రస్తుతం 'భీమా' అనే సినిమా చేస్తున్నాడు. ఇదిలా ఉంటే తన తదుపరి సినిమాని శ్రీను వైట్ల దర్శకత్వంలో చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. గోపీచంద్ మాస్ హీరో అయినప్పటికీ కామెడీతోనూ అదరగొడతాడు. వినోదాన్ని నమ్ముకొని ఆయన చేసిన 'లౌక్యం' మంచి విజయాన్ని అందించింది. కామెడీలో దిట్ట అయిన శ్రీను వైట్ల తోనూ ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తాడేమో చూడాలి. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ లో రూపొందనున్న ఈ చిత్రానికి ప్రియదర్శిని రామ్ కథ అందిస్తున్నట్లు వినికిడి. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్రకటించనున్నారని అంటున్నారు.