Read more!

English | Telugu

సంక్రాంతి బరి నుంచి 'ఫ్యామిలీ స్టార్' ఔట్!

2024 సంక్రాంతి సీజన్ పై పలు సినిమాలు కర్చీఫ్ వేశాయి. సంక్రాంతి పోరుకి సిద్ధమంటూ ఇప్పటికే 'గుంటూరు కారం', 'హనుమాన్', 'ఈగల్', 'ఫ్యామిలీ స్టార్', 'సైంధవ్', 'నా సామి రంగ' ఇలా పలు మూవీ టీమ్స్ ప్రకటించాయి. అయితే వీటిలో చివరికి నిలిచే సినిమాలు ఎన్నో అనే అనుమానం అందరిలో ఉంది. సంక్రాంతి బరి నుంచి ఆ సినిమా ఔట్, ఈ సినిమా ఔట్ అని ఇప్పటికే పలు వార్తలు వినిపించాయి. తాజాగా ఈ పోరు నుంచి 'ఫ్యామిలీ స్టార్' తప్పుకుంది అంటూ కొత్త న్యూస్ వినిపిస్తోంది.

'గీత గోవిందం' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ, పరశురామ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం 'ఫ్యామిలీ స్టార్'. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్. 'గీత గోవిందం' కాంబోలో వస్తున్న సినిమా కావడంతో 'ఫ్యామిలీ స్టార్'పై మంచి అంచనాలే ఉన్నాయి. ఇటీవల విడుదలైన గ్లింప్స్ కి మంచి స్పందనే లభించింది. ముఖ్యంగా 'ఐరనే వంచాలా ఏంటి' అనే డైలాగ్ మీమ్ మెటీరియల్ గా మారింది. 

'ఫ్యామిలీ స్టార్' సినిమాని ముందు నుంచి సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నెల క్రితం 50 శాతం షూటింగ్ పూర్తయిందని, ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్రాంతికే విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. అయితే మూడు నెలల్లో మిగతా సగం షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తయ్యి నిజంగా సంక్రాంతికి విడుదలవుతుందా? అనే అనుమానాలు అప్పుడే వ్యక్తమయ్యాయి. అయితే ఇప్పుడు ఆ అనుమానాలే నిజమయ్యేలా ఉన్నాయి. ఓ వైపు షూటింగ్, మరోవైపు ఎడిటింగ్ పనులతో మూవీ టీమ్ పరుగులు పెడుతున్నప్పటికీ.. సంక్రాంతికి రావడమే అనుమానమే అంటున్నారు. దానికితోడు నాన్ థియేటర్ అమ్మకాలు ఇంకా పూర్తి కాలేదట. ఈ లెక్కన ఈ సినిమా సంక్రాంతికి రావడం అనుమానమే అని టాక్ వినిపిస్తోంది.