Read more!

English | Telugu

పొంగల్ పోరు నుంచి తప్పుకున్న ఫ్యామిలీ స్టార్!

2024 సంక్రాంతి బరి నుంచి 'ఫ్యామిలీ స్టార్' తప్పుకునే అవకాశముందని ఇటీవల వార్తలు వినిపించాయి. అయితే ఆ వార్తలు నిజమయ్యాయని, సంక్రాంతి పోరు నుంచి ఫ్యామిలీ స్టార్ తప్పుకోవడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాల్లో న్యూస్ బలంగా వినిపిస్తోంది.

సంక్రాంతి సీజన్ పై పలు సినిమాలు కర్చీఫ్ వేశాయి. పొంగల్ పోరుకి సిద్ధమంటూ ఇప్పటికే 'గుంటూరు కారం', 'హనుమాన్', 'ఈగల్', 'ఫ్యామిలీ స్టార్', 'సైంధవ్', 'నా సామి రంగ' వంటి చిత్రాలు ప్రకటించాయి. అయితే వీటిలో చివరికి నిలిచే సినిమాలు ఎన్నో అనే అనుమానం అందరిలో ఉంది. అందుకు తగ్గట్టుగానే తాజాగా 'ఫ్యామిలీ స్టార్' తప్పుకుందని ఇన్ సైడ్ టాక్.

'గీత గోవిందం' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ, పరశురామ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం 'ఫ్యామిలీ స్టార్'. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్. 'గీత గోవిందం' కాంబోలో వస్తున్న సినిమా కావడంతో 'ఫ్యామిలీ స్టార్'పై మంచి అంచనాలే ఉన్నాయి. ఇటీవల విడుదలైన గ్లింప్స్ కి మంచి స్పందనే లభించింది. ముఖ్యంగా 'ఐరనే వంచాలా ఏంటి' అనే డైలాగ్ మీమ్ మెటీరియల్ గా మారింది. 

'ఫ్యామిలీ స్టార్' చిత్రాన్ని ముందు నుంచి సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఓ నెల క్రితం 50 శాతం షూటింగ్ పూర్తయిందని, ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్రాంతికే విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. అయితే మూడు నెలల్లో మిగతా సగం షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తయ్యి నిజంగా సంక్రాంతికి విడుదలవుతుందా? అనే అనుమానాలు అప్పుడే వ్యక్తమయ్యాయి. అయితే ఇప్పుడు ఆ అనుమానాలే నిజమయ్యేలా ఉన్నాయి. విడుదలకు ఇంకా రెండు నెలల సమయమే ఉంది. ఇంకా దాదాపు 30 శాతం షూటింగ్ బ్యాలెన్స్ ఉందట. పైగా ఇందులో యూఎస్ షెడ్యూల్ కూడా పెండింగ్ ఉందట. ఓ వైపు షూటింగ్, మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులతో మూవీ టీమ్ ఎంత పరుగులు పెట్టినా.. సంక్రాంతికి రావడం అనుమానమే అని అంటున్నారు.