English | Telugu
క్రేజీ మల్టీస్టారర్.. సైలెంట్ గా 40 శాతం షూటింగ్ పూర్తి!
Updated : Nov 28, 2023
ఈమధ్య సినిమాని అధికారికంగా ప్రకటించకుండా సైలెంట్ గా షూట్ చేయడం ట్రెండ్ గా మారింది. సితార ఎంటర్టైన్మెంట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వంటి ప్రముఖ నిర్మాణ సంస్థలు ఈ ట్రెండ్ ని ఫాలో అవుతున్నాయి. ప్రభాస్, మారుతి కాంబినేషన్ లో పీపుల్ మీడియా బ్యానర్ లో రూపొందుతోన్న మూవీ అలాగే అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాకుండా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడదే బాటలో మరో సినిమా పయనిస్తోంది. అది కూడా పీపుల్ మీడియా బ్యానర్ లోనే రూపొందుతుండటం విశేషం.
రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న 'ఈగల్' చిత్రం 2024 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా విడుదల కాకముందే ఇదే కాంబినేషన్ లో మరో చిత్రాన్ని నిర్మిస్తోంది పీపుల్ మీడియా. పైగా ఇది మల్టీస్టారర్ కావడం విశేషం. రవితేజతో పాటు మంచు మనోజ్, తేజ సజ్జా ఇందులో నటిస్తున్నారు. ఇందులో మనోజ్ ది విలన్ రోల్ అని తెలుస్తోంది. అంతేకాదు ఇప్పటికే ఈ సినిమా సైలెంట్ గా 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకుందని సమాచారం.
మామూలుగా సినిమా హిట్ అయితే దర్శకుడికి మరో అవకాశం ఇవ్వడం సహజం. అలాంటిది సినిమా విడుదల కాకముందే అవకాశం ఇవ్వడమే కాకుండా, సైలెంట్ గా షూటింగ్ కూడా చేస్తుండటం ఆసక్తికరంగా మారింది. మరి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఎంతవరకు నిలబెట్టుకుంటాడో చూడాలి.