English | Telugu

బోయపాటికి ఎంత కష్టం వచ్చింది.. బన్నితో సినిమా అంటే అంత ఈజీనా?

సినిమా రంగంలో సక్సెస్‌పైనే అన్నీ ఆధారపడి ఉంటాయి. హీరో, డైరెక్టర్‌, ప్రొడ్యూసర్‌, టెక్నీషియన్లు.. ఇలా ఎవరైనా సక్సెస్‌లో ఉంటేనే ఏదైనా జరుగుతుంది. ఒక్కోసారి టెక్నీషియన్స్‌కి సక్సెస్‌తో సంబంధం ఉండదు. సినిమా కోసం అందరూ కష్టపడతారు. కానీ, సినిమా హిట్‌ అయినా, ఫ్లాప్‌ అయినా ఆ క్రెడిట్‌ అంతా డైరెక్టర్‌కే దక్కుతుంది. అందుకే డైరెక్టర్‌ ఈజ్‌ ద కెప్టెన్‌ ఆఫ్‌ ద షిప్‌ అన్నారు. అటువంటి డైరెక్టర్‌ కెరీర్‌ సక్సెస్‌ఫుల్‌గా వెళుతుంటే అవకాశాలు కూడా వాటంతట అవే వస్తాయి. ఏ హీరో అయినా ఆ డైరెక్టర్‌తో సినిమా చేసేందుకు ముందుకు వస్తాడు. ఒకటి, రెండు ఫ్లాపులు వచ్చిన తర్వాత ఏ హీరో అయినా ఆ దర్శకుడితో సినిమా చెయ్యాలంటే ఎన్నో కండీషన్స్‌ పెడతాడు. ఒక్కోసారి కథ విని సినిమా చెయ్యను అని చెప్పకుండా తాత్సారం చేస్తుంటారు. ఇప్పుడు అలాంటి పొజిషన్‌లో ఉన్న బోయపాటి శ్రీనుకి కూడా కండీషన్స్‌ అనేది అనుభవంలోకి వచ్చిందని తెలుస్తోంది. 

‘భద్ర’ నుంచి ‘స్కంద’ వరకు ఎన్నో సినిమాలను డైరెక్ట్‌ చేసిన బోయపాటి శ్రీను గత చిత్రం ‘స్కంద’ డిజాస్టర్‌ అవ్వడంతో లెక్కలు మారిపోయాయి. అల్లు అర్జున్‌, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ‘సరైనోడు’ వంటి సూపర్‌హిట్‌ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా రాలేదు. అయితే ‘పుష్ప’ వంటి సంచలన విజయం తర్వాత బన్ని ఇమేజ్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ సినిమా తర్వాత తను చేసే సినిమాల విషయంలో బన్ని ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. తనకు ‘సరైనోడు’ వంటి సూపర్‌ హిట్‌ ఇచ్చిన దర్శకుడైనా సరే అతనితో సినిమా చెయ్యాలంటే కొన్ని కండీషన్స్‌ పెట్టక తప్పడం లేదని సినీ వర్గాల్లో చెప్పుకుంటున్నారు. ఎందుకంటే రామ్‌తో బోయపాటి శ్రీను చేసిన ‘స్కంద’లో ఎన్నో లాజిక్స్‌ మిస్‌ అయ్యాయని, ఈ విషయంలో బోయపాటి సరైన జాగ్రత్తలు తీసుకోలేదని, అందుకే సినిమా డిజాస్టర్‌ అయిందని సోషల్‌ మీడియాలో బోయపాటిపై తీవ్రంగా ట్రోలింగ్‌ జరిగింది. దీంతో అతను నెక్స్‌ట్‌ చేయబోయే సినిమా ఎలా ఉండబోతోంది అనే అంశంపైనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం అల్లు అర్జున్‌ కోసం బోయపాటి వర్క్‌ చేస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. స్కంద సినిమా టైమ్‌లోనే తన నెక్స్‌ట్‌ మూవీ బన్నితో ఉంటుందని ప్రకటించాడు బోయపాటి. ‘పుష్ప2’ పూర్తయ్యాక త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో సినిమా చెయ్యబోతున్నాడు బన్ని. అయితే ఈ సినిమా ప్రారంభం కావడానికి 8 నెలలు టైమ్‌ పడుతుంది. ఈ గ్యాప్‌లో ఓ సినిమా చెయ్యాలన్నది బన్నీ ఆలోచన. అయితే బన్ని చేయబోయే సినిమా బోయపాటితోనే అయి ఉంటుందా? అతనికి సినిమా చేసే  ఛాన్స్‌ ఇస్తాడా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

తనతో సినిమా చెయ్యాలంటే స్క్రిప్ట్‌ సాలిడ్‌గా ఉండాలని, లాజిక్స్‌ మిస్‌ అవ్వకుండా క్లియర్‌గా ఉండాలని బోయపాటితో బన్ని చెప్పాడని ప్రచారం జరుగుతోంది. విషయం తెలుసుకున్న బోయపాటి.. బన్నికి నచ్చే విధంగా కథను సిద్ధం చేసే పనిలో ఉన్నాడని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం బన్నికి ప్యాన్‌ ఇండియా ఇమేజ్‌ వచ్చేసింది. దీంతో అలాంటి సినిమాలు చేసే డైరెక్టర్లపైనే దృష్టి పెట్టాడనే టాక్‌ వినిపిస్తోంది. ఈ పరిస్థితిలో బన్నితో బోయపాటి సినిమా చెయ్యాలంటే అతను రెడీ చేసే కథ ఎంత స్ట్రాంగ్‌గా ఉండాలనే విషయం అతనికి తెలియాలి అంటున్నారు.