English | Telugu
ఆ విషయంలో రజనీకాంత్‌ను క్రాస్ చేసి కొత్త రికార్డు క్రియేట్ చేసిన బన్నీ?
Updated : Nov 28, 2023
సినిమాల మేకింగ్ విషయంలో రోజురోజుకీ కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అది బడ్జెట్ పరంగా కావచ్చు, కాంబినేషన్ పరంగా కావొచ్చు, రెమ్యునరేషన్ల పరంగా కావచ్చు. ఏది ఏమైనా మార్పు అనేది చాలా వేగంగా జరుగుతోంది. తెలుగు సినిమా కొత్త పుంతలు తొక్కుతోంది. ఇంతకుముందు తెలుగు రాష్ట్రాలు లేదా పక్క రాష్ట్రాల వరకే పరిమితమైన తెలుగు సినిమా ఇప్పుడు ప్రపంచంలోని అతి పెద్ద సినిమా ఇండస్ట్రీల్లో ఒకటిగా పేరు తెచ్చుకుంటోంది. తెలుగు సినిమాకి ఇంత స్పాన్ రావడానికి ముఖ్య కారకుడు రాజమౌళి అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇండస్ట్రీ తీరు తెన్నులు మారుతున్నట్టే హీరోల రెమ్యునరేషన్లకు కూడా రెక్కలొస్తున్నాయి. దానికీ కారణం లేకపోలేదు. ఇంతకుముందు తెలుగు సినిమా అంటే తెలుగు వరకే పరిమితై ఉండేది. ఆ తర్వాత తెలుగు, తమిళ్ భాషల్లో నిర్మించేవారు. ఇప్పుడలా కాదు. పాన్ ఇండియా మూవీ పేరుతో ఒక్కో సినిమాని అయిదారు భాషల్లో ఏకకాలంలో రిలీజ్ చేస్తున్నారు. దీంతో సినిమా హిట్ అయితే కలెక్షన్లు ఓ రేంజ్‌లో ఉంటున్నాయి. దానికి తగ్గట్టుగానే హీరోలు తమ రెమ్యునరేషన్లను పెంచుతున్నారు. వారు కోరినంత డబ్బు ఇచ్చేందుకు నిర్మాతలు కూడా సిద్ధంగానే ఉంటున్నారు.
ఇంతకుముందు సౌత్‌లో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోగా రజనీకాంత్‌కి ఒక రికార్డు ఉంది. ఇప్పుడు ఆ రికార్డును క్రాస్ చేసే దిశగా తెలుగు హీరోలు దూసుకెళ్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప2’ కోసం తీసుకుంటున్న రెమ్యునరేషన్‌తో రజనీకాంత్ రికార్డును క్రాస్ చేసినట్టు సమాచారం అందుతోంది. ప్రస్తుతం రజనీకాంత్ రెమ్యునరేషన్ రూ.130 కోట్లుగా ఉందట. ఇంతకుముందు వంద కోట్లు కాస్తా ఇప్పుడు నూట ముప్పై కోట్లు అయ్యింది. అయితే అల్లు అర్జున్ ‘పుష్ప2’ చిత్రానికి టోటల్‌గా రూ.150 కోట్లు రెమ్యునరేషన్‌గా తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది.
‘పుష్ప’ చిత్రం సాధించిన ఘనవిజయం గురించి అందరికీ తెలిసిందే. తెలుగు సినిమా చరిత్రలో ఏ నటుడూ సాధించలేకపోయిన జాతీయ ఉత్తమ నటుడు అవార్డును అల్లు అర్జున్ సాధించి తెలుగు వారి కీర్తిని మరింత పెంచాడు. ఇప్పుడు ‘పుష్ప2’ అంతకుమించిన విజయం సాధించేలా ఉండాలని యూనిట్‌లోని అందరూ ఎంతో కష్టపడుతున్నారు. ఈసారి ‘పుష్ప2’ను ఆస్కార్ వెళ్ళేలా చెయ్యాలని అనుకుంటున్నారు. ఈ సినిమాకు అల్లు అర్జున్ భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. దర్శకుడు సుకుమార్ ఈ సినిమా కోసం అందుకుంటున్న రెమ్యునరేషన్ రూ.100 కోట్లుగా ఉందని సమాచారం అందుతోంది. ఇక ఈ మూవీలో నటిస్తున్నందుకుగాను అల్లు అర్జున్ రూ.150 కోట్ల వరకు అందుకుంటాడని తెలుస్తోంది. అయితే ఈ రెమ్యునరేషన్ మొత్తంలో ఒక చిన్న ట్విస్ట్ వుంది. అదేమిటంటే రెమ్యునరేషన్‌తోపాటు సినిమాకి వచ్చే లాభాల్లో 30 శాతం వాటా అల్లు అర్జున్ తీసుకోబోతున్నారని సమాచారం. ఈ లెక్కల ప్రకారం బన్నికి మొత్తం రూ.150 కోట్ల వరకు మేకర్స్ ముట్టజెపుతారని తెలుస్తోంది.