English | Telugu

'దేవర'లో ఛత్రపతి సీన్!

'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం 'దేవర'. 'ఆర్ఆర్ఆర్'తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్.. 'దేవర'తో తన ఇమేజ్ ని మరింత పెంచుకోవాలి అనుకుంటున్నారు. ఇక 'ఆచార్య'తో ఘోర పరాజయాన్ని చూసిన కొరటాల.. 'దేవర'తో మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి రావాలని చూస్తున్నారు. ఇలా ఇద్దరు ఎంతో కసిగా, పక్కా ప్లానింగ్ తో సినిమా చేస్తున్నారు. మూవీ టీం ముందుగా యాక్షన్ సన్నివేశాలను పూర్తిచేసే పనిలో ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికర న్యూస్ వినిపిస్తోంది. అదేంటంటే ఇందులో 'ఛత్రపతి' సీన్ ఉంటుందట.

ప్రభాస్, రాజమౌళి కలయికలో 2005 లో వచ్చిన చిత్రం 'ఛత్రపతి'. ఇందులో సొరచేపతో ప్రభాస్ ఇంట్రడక్షన్ సీన్ అప్పట్లో హైలైట్ గా నిలిచింది. ఇప్పుడు అదే తరహాలో 'దేవర'లో సొరచేపతో ఎన్టీఆర్ తలపడే సన్నివేశాన్ని కొరటాల ప్లాన్ చేశారట. 2005 తో పోలిస్తే ఇప్పుడు టెక్నాలజీ పరంగా, గ్రాఫిక్స్ పరంగా తెలుగు పరిశ్రమ ఎంతో అభివృద్ధి చెందింది. ఇప్పుడున్న వనరులతో సొరచేప ఫైట్ సీన్ ని సరిగ్గా తెరకెక్కిస్తే వెండితెర మీద అదిరిపోతుంది అనడంలో సందేహం లేదు. పైగా సముద్ర తీర ప్రాంతంలో జరిగే కథ కావడంతో కొరటాల ఈ ఫైట్ సీన్ ని ప్లాన్ చేశారట. 'ఆర్ఆర్ఆర్'లో పులితో ఎన్టీఆర్ సన్నివేశాలు ఎలాగైతే హైలైట్ గా నిలిచాయో.. 'దేవర'లో కూడా ఆ స్థాయి సన్నివేశాలను కొరటాల ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.