English | Telugu
వివాదాలు లేని అనుష్క.. ఎఫైర్ రూమర్స్ మాత్రం పుష్కలం!
Updated : Nov 8, 2023
‘సూపర్’ చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన అనుష్క ఆ తర్వాత చేసిన సినిమాలతో హీరోయిన్‌గా ఎంత పాపులారిటీ సంపాదించుకుందో అందరికీ తెలిసిందే. ‘అరుంధతి’ వంటి మైల్‌స్టోన్ మూవీతో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చేసింది. అలాంటి క్యారెక్టర్ చెయ్యగల సత్తా ఒక్క అనుష్కకే ఉంది అనే ఒపీనియన్ అందరికీ కలిగేలా చేసింది. ‘బాహుబలి’తో ఆమె రేంజ్ మరింత పెరిగిపోయింది. ముంబైలో యోగా టీచర్‌గా ఉన్న అనుష్క సిల్వర్ స్క్రీన్‌పై మెరిసి తారగా ఎవ్వరికీ అందనంత ఎత్తుకు ఎదిగింది. 18 ఏళ్ళ తన కెరీర్‌లో ఎలాంటి వివాదాలు లేని హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. ఎవ్వరినీ కామెంట్ చెయ్యడంగానీ, నిర్మాతలను ఇబ్బంది పెట్టడం కానీ ఎప్పుడూ చెయ్యలేదు.
ఇదంతా బాగానే ఉంది. కానీ, ఆమె వ్యక్తిగత జీవితానికి వస్తే ఆమెకు పలువురు సెలబ్రిటీస్‌తో ఎఫైర్లు ఉన్నాయనే వార్తలు మాత్రం ఆమె కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు వస్తూనే ఉన్నాయి. 42 ఏళ్ల అనుష్క కొంతమంది స్టార్ హీరోలతో గతంలో రిలేషన్ మెయిన్‌టెయిన్ చేసిందనే వార్తలు పలుమార్లు మీడియాలో దర్శనమిచ్చాయి. తన సుదీర్ఘమైన కెరీర్‌లో నిర్మాతలనుగానీ, దర్శకులనుగానీ ఇబ్బంది పెట్టిన సందర్భాలు శూన్యమనే చెప్పాలి. ఇక సోషల్ మీడియాలో కూడా అనుష్క చాలా సైలెంట్. తన ఫ్యామిలీ, పరిశ్రమలో అతి దగ్గర వ్యక్తులకు సంబంధించిన విషయాలపై మాత్రమే స్పందిస్తుంది. అలాంటి అనుష్కపై ఎఫైర్ రూమర్స్ రావడం ఎవ్వరూ నమ్మలేనిది. వాటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ప్రభాస్, అనుష్క పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త. వారి మధ్య చాలాకాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తోందని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు ఎంతోకాలంగా వస్తూనే ఉన్నాయి. తమ మధ్య ఏమీ లేదని, కేవలం మంచి స్నేహితులం మాత్రమేనని ఇద్దరూ ఎన్నోసార్లు చెప్పారు. అయినా ఎవరూ నమ్మడం లేదు. వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే రూమర్ ‘బాహుబలి’ నుంచి బాగా ప్రచారంలోకి వచ్చింది. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ చేసిన ‘సాహో’ చిత్రానికి సంబంధించి ప్రమోషన్స్ కోసం దేశంలోని ప్రధాన నగరాల్లో పర్యటించాడు ప్రభాస్. ఎక్కడికి వెళ్ళినా అక్కడి మీడియా అనుష్కతో పెళ్లెప్పుడు అనే ప్రశ్న వేసేవారు. దీన్ని బట్టి వీరి పెళ్ళి రూమర్ ఎంతగా స్ప్రెడ్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు.
ప్రభాస్ కంటే ముందు అంటే అనుష్క కెరీర్ ప్రారంభం నుంచే ఆమె గురించి రకరకాల రూమర్స్ వినిపించేవి. అందులో భాగంగానే హీరో గోపీచంద్, అనుష్క లవ్‌లో పడ్డారనే రూమర్ అప్పట్లో హల్‌చల్ చేసింది. ‘లక్ష్యం’ చిత్రంలో గోపీచంద్ సరసన నటించింది అనుష్క. ఆ సినిమా సూపర్‌హిట్ అయ్యింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో ‘శౌర్యం’ మూవీ రూపొందింది. అది కూడా విజయం సాధించింది. ఆ సినిమాల సమయంలోనే అనుష్క, గోపీచంద్ మధ్య ప్రేమ చిగురించిందని, పెళ్లి కూడా చేసుకోనున్నారనే రూమర్స్ వచ్చాయి. అయితే అవి రూమర్స్‌గానే మిగిలిపోయాయి. ఈ పుకార్లకు తెరదించుతూ 2013లో శ్రీకాంత్ మేనకోడలిని గోపీచంద్ పెళ్లి చేసుకున్నాడు.
నాగార్జున హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘సూపర్’ అనుష్క మొదటి చిత్రం. ఈ సినిమాలో అవకాశం రావడానికి నాగార్జున కుమారుడు నాగచైతన్య కారణమని అప్పట్లో వార్తలు వినిపించాయి. ముంబాయిలో యోగా టీచర్‌గా ఉన్న అనుష్కను నాగచైతన్య.. నాగార్జునకు పరిచయం చేశాడు. నాగార్జున ‘సూపర్’ సినిమాలో అవకాశం ఇప్పించాడని చెబుతారు. ఆ తర్వాత డాన్, కేడి చిత్రాల్లో నాగార్జునకు జోడీగా నటించింది అనుష్క. ‘కింగ్’ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసింది కూడా. ఆ సమయంలో నాగార్జున, అనుష్క మధ్య వ్యవహారం ఉందనే పుకార్లు షికార్లు చేశాయి.
ఆ తర్వాత రాజమౌళి ఆస్థాన సినిమాటోగ్రాఫర్ కె.కె.సెంథిల్‌కుమార్, అనుష్క ప్రేమించుకుంటున్నారంటూ వార్తలు వచ్చాయి. వీరిద్దరి రిలేషన్ గురించి వినిపించిన రూమర్స్ అప్పట్లో సంచలనం సృష్టించాయి. పెద్దవాళ్ళను ఒప్పించి ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారట. కారణం తెలీదుగానీ ఆ తర్వాత వీరిద్దరూ పెళ్లి విషయంలో నిర్ణయం మార్చుకున్నారని కూడా వార్తలు వచ్చాయి. 2009లో రూహి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు సెంథిల్. ఈ పెళ్లికి అనుష్క కూడా హాజరై సందడి చేయడం విశేషం.