English | Telugu

'దేవర'కి పోటీగా చిరు సినిమా.. కొరటాల శివని వదలట్లేదుగా.. !

'ఆచార్య' (2022) కోసం తొలిసారిగా కలిసి పనిచేశారు మెగాస్టార్ చిరంజీవి, స్టార్ కెప్టెన్ కొరటాల శివ. భారీ అంచనాల నడుమ విడుదలైన సదరు సినిమా ఆశించిన విజయం సాధించలేదు. ఇంకా చెప్పాలంటే.. చిరు కెరీర్ బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచింది 'ఆచార్య'. ఇక కొరటాల శివ విషయానికి వస్తే.. అప్పటివరకు వరుస విజయాలతో సాగుతున్న తనకదే మొదటి డిజాస్టర్. 

ఇదిలా ఉంటే, 'ఆచార్య' కోసం కలిసి పనిచేసిన చిరు, కొరటాల.. వచ్చే ఏడాది బాక్సాఫీస్ వార్ కి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే.. కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా 'దేవర' పేరుతో ఓ పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా 2024 వేసవి కానుకగా ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. ఇక అదే తేదికి అటుఇటుగా చిరు కొత్త సినిమాని రిలీజ్ చేసే ప్లాన్ జరుగుతోందట. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చిరంజీవి చేయనున్న ప్రాజెక్ట్.. అక్టోబర్ లో మొదలై మార్చి నెలాఖరులో లేదా ఏప్రిల్ ప్రథమార్ధంలో స్క్రీన్ పైకి వచ్చే అవకాశముందని సమాచారం. మరి.. కలిసి హిట్టు కొట్టలేకపోయిన చిరు, కొరటాల.. పోటీలోనైనా విజయం అందుకుంటారేమో చూడాలి.