English | Telugu

మెగా ప్లాన్ ఛేంజ్: కళ్యాణ్ కృష్ణ ఔట్.. మురుగదాస్ ఇన్?

'భోళా శంకర్' ఫలితం.. 'బంగార్రాజు' దర్శకుడిని ఇబ్బందుల్లో పడేసిందా? అవునన్నదే ఫిల్మ్ నగర్ టాక్. 

ఆ వివరాల్లోకి వెళితే.. 'భోళా శంకర్' తరువాత మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి చిత్రాన్ని 'సోగ్గాడే చిన్ని నాయనా', 'బంగార్రాజు' సినిమాల దర్శకుడు కళ్యాణ్ కృష్ణతో చేయబోతున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతున్నట్లు కూడా ప్రచారం జరిగింది. అంతేకాదు..  మలయాళ చిత్రం 'బ్రో డాడీ'కి రీమేక్ గా ఈ మూవీ ఉండబోతున్నట్లు కథనాలు వచ్చాయి.

లేటెస్ట్ బజ్ ఏంటంటే.. 'భోళా శంకర్' డిజాస్టర్ కావడంతో రీమేక్స్ విషయంలో పునరాలోచనలో పడ్డారట మెగాస్టార్. ఈ నేపథ్యంలోనే.. ప్రముఖ తమిళ దర్శకుడు ఎ.ఆర్. మురుగదాస్ చెప్పిన స్టోరీ లైన్ నచ్చడంతో.. కళ్యాణ్ కృష్ణ ప్రాజెక్ట్ కి బ్రేక్ వేశారని టాక్. అంతేకాదు.. 'స్టాలిన్' తరువాత చిరు, మురుగదాస్ కాంబోలో రానున్న ఈ సినిమాకి జీవీ ప్రకాశ్ కుమార్ లేదా దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించే అవకాశం ఉందని వినిపిస్తోంది. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.