English | Telugu
బెల్లంకొండతో అనిల్ సుంకర సినిమా.. డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాకవుతారు!
Updated : Nov 22, 2023
వి.వి. వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అల్లుడు శీను' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. హీరోగా నిలదొక్కుకోవడానికి గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటిదాకా అతను తొమ్మిది సినిమాల్లో హీరోగా నటించగా అందులో 'రాక్షసుడు' మాత్రమే విజయాన్ని సాధించింది. దాంతో సినిమాల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ, ఎలాగైనా మంచి విజయాలు అందుకోవాలని చూస్తున్నాడు బెల్లంకొండ. ప్రస్తుతం 'భీమ్లా నాయక్' ఫేమ్ సాగర్ చంద్ర డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. అలాగే 'రాక్షసుడు-2'లో నటించనున్నాడు. వీటితో పాటు తాజాగా మరో సినిమా అంగీకరించినట్లు తెలుస్తోంది.
బెల్లంకొండతో ఓ సినిమా చేయడానికి నిర్మాత అనిల్ సుంకర సన్నాహాలు చేస్తున్నాడట. బెల్లంకొండ మాదిరిగానే ప్రస్తుతం అనిల్ సుంకర కూడా హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఆయన ప్రొడ్యూస్ చేసిన రీసెంట్ మూవీస్ 'ఏజెంట్', 'భోళా శంకర్' డిజాస్టర్స్ గా నిలిచాయి. అలాంటి అనిల్ సుంకర హిట్ కోసం ఫ్లాప్స్ లో ఉన్న హీరోతో సినిమా చేయడానికి సిద్ధమవుతుండటం ఆసక్తికరంగా మారింది. ఇక ఈ మూవీ కోసం ఊహించని దర్శకుడిని రంగంలోకి దింపుతుండటం విశేషం. యాంకర్ ప్రదీప్ హీరోగా నటించిన '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఫణి ప్రదీప్(మున్నా) ఈ ప్రాజెక్ట్ కి డైరెక్టర్ గా వ్యవహరించనున్నాడని సమాచారం. మరి ఈ కొత్త కాంబోలో రానున్న సినిమా బెల్లంకొండకి, అనిల్ సుంకరకి ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.