English | Telugu
ఊహించని దర్శకుడితో బాలయ్య మూవీ.. రికార్డుల మోతే!
Updated : Feb 19, 2024
సీనియర్ స్టార్స్ లో నటసింహం నందమూరి బాలకృష్ణ మూవీ లైనప్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 'అఖండ', 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి' సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న బాలయ్య.. ప్రస్తుతం బాబీ కొల్లి డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత దర్శకులు బోయపాటి శ్రీను, హరీష్ శంకర్ తో సినిమాలు చేయనున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా ఓ కుర్ర దర్శకుడితో సినిమా చేయడానికి బాలకృష్ణ అంగీకరించినట్లు తెలుస్తోంది.
విజయ్ దేవరకొండతో 'టాక్సీవాలా', నానితో 'శ్యామ్ సింగ రాయ్' చిత్రాలను రూపొందించి ఆకట్టుకున్న యువ దర్శకుడు రాహుల్ సాంకృత్యన్.. తన తదుపరి సినిమాని జూనియర్ ఎన్టీఆర్ తో చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు ఇటీవల వార్తలొచ్చాయి. అయితే ఇప్పటికే ఎన్టీఆర్ చేతిలో పలు భారీ ప్రాజెక్ట్ లు ఉన్నాయి. అవి పూర్తి కావడానికి చాలా సమయం పడుతుంది. దీంతో ఎన్టీఆర్ కి బదులుగా.. బాలకృష్ణతో సినిమా చేయడానికి రాహుల్ సాంకృత్యన్ ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదొక పీరియడ్ యాక్షన్ డ్రామా అని సమాచారం. ఇటీవల బాలయ్యను కలిసి రాహుల్ కథ వినిపించగా.. ఆయన ఇంప్రెస్ అయ్యాడట. అన్ని జానర్ చిత్రాలు చేయగల స్టార్ గా పేరున్న బాలయ్య.. ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నట్లు వినికిడి. ఈ భారీ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించే అవకాశముందని అంటున్నారు. అన్నీ కుదిరితే వచ్చే ఏడాది ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది.