English | Telugu

బ్రేకింగ్‌.. అనుష్క శీలావతి అంటున్న క్రిష్‌?

‘సూపర్‌’ చిత్రంతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అనుష్క దాదాపు 20 సంవత్సరాల కెరీర్‌లో 50 సినిమాల్లో నటించింది. తెలుగు, తమిళ్‌ చిత్రాల్లో మాత్రమే ఆమె నటించడం విశేషం. కర్ణాటక రాష్ట్రానికి చెందిన అనుష్క కన్నడలో ఒక్క సినిమా కూడా చెయ్యలేదు. ఆమె మూడో సినిమా విక్రమార్కుడు. ఈ సినిమాతో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకొని ఎన్నో సూపర్‌హిట్‌ సినిమాల్లో నటించింది. బాహుబలి సిరీస్‌తో ఆమె రేంజ్‌ పూర్తిగా మారిపోయింది. స్టార్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న అనుష్క బాహుబలి తర్వాత చేసిన సినిమాలు చాలా తక్కువ. 2017లో బాహుబలి 2 రిలీజ్‌ అవ్వగా ఈ ఏడు సంవత్సరాల్లో కేవలం నాలుగు సినిమాల్లో మాత్రమే నటించింది. 2018లో వచ్చిన భాగమతి, గత సంవత్సరం వచ్చిన ‘మిస్‌శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’.. ఈ రెండు యువి క్రియేషన్స్‌ సంస్థ నిర్మించిన సినిమాలే కావడం విశేషం. ఇప్పుడు ఇదే సంస్థ నిర్మిస్తున్న మరో సినిమా చేసేందుకు అనుష్క ఓకే చెప్పింది. 

క్రిష్‌ దర్శకత్వంలో యువి క్రియేషన్స్‌ నిర్మిస్తున్న సినిమా షూటింగ్‌ ఇప్పటికే మొదలైంది. ఆంధ్రా, ఒడిశా బోర్డర్‌లో ఈ సినిమా కొంతభాగం షూట్‌ చేశారని తెలుస్తోంది. తనకు జరిగిన అన్యాయాన్ని ఎదిరించి పోరాడే అమ్మాయిగా ఈ సినిమాలో అనుష్క కనిపిస్తుందట. హైదరాబాద్‌లో వేసిన ప్రత్యేకమైన సెట్‌లో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ జరుగుతోందని సమాచారం. ఈ సినిమాకి ‘శీలావతి’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. వేదం తర్వాత అనుష్క, క్రిష్‌ కాంబినేషన్‌లో ఈ సినిమా రూపొందుతోంది. శరవేగంగా షూటింగ్‌ పూర్తి చేసి ఈ ఏడాదే సినిమాను రిలీజ్‌ చెయ్యాలని ప్లాన్‌ చేశారు. తెలుగు, తమిళ్‌, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా రిలీజ్‌ అవుతుంది. ఈ సినిమాకి సంబంధించిన ఎనౌన్స్‌మెంట్‌గానీ, షూటింగ్‌ అప్‌డేట్‌గాని ఇప్పటివరకు చిత్ర యూనిట్‌ ప్రకటించలేదు. అయినా ఈ సినిమా షూటింగ్‌కి సంబంధించిన ఫోటోలు వైరల్‌గా మారాయి. ఒడిశాలోని ఒక మహిళ జీవితంలో జరిగిన యదార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. కీరవాణి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.