English | Telugu

దిల్ రాజా మజాకా.. 'బలగం' వేణు దర్శకత్వంలో శర్వానంద్!

'బలగం' సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన కమెడియన్ వేణు.. మొదటి సినిమాతోనే ప్రేక్షకుల మెప్పు పొందడంతో పాటు, విమర్శకుల ప్రశంసలు అందుకొని ప్రతిభగల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇక రెండో సినిమాని నానిని డైరెక్ట్ చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు. దిల్ రాజు బ్యానర్ లో రూపొందే ఈ సినిమాకి  'ఎల్లమ్మ' అనే టైటిల్ కూడా ప్రచారం జరిగింది. అయితే ఏవో కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ నుండి నాని తప్పుకున్నట్లు వార్తలొస్తున్నాయి. అంతేకాదు, నాని స్థానంలో శర్వానంద్ రంగంలోకి దిగుతున్నట్లు టాక్.

'బలగం' తర్వాత నానితో సినిమా కోసం వేణు చాలా రోజులు ఎదురుచూశాడు. స్క్రిప్ట్ కూడా మొత్తం సిద్ధం చేశాడట. అయితే 'దసరా' ఫేమ్ శ్రీకాంత్ ఓదెలతో తాను చేయనున్న సినిమాలోని హీరో పాత్ర, వేణు చెప్పిన స్క్రిప్ట్ లోని హీరో పాత్ర కాస్త ఒకేలా ఉండటంతో.. నాని కథ నచ్చి కూడా 'ఎల్లమ్మ' సినిమా చేయడానికి వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. దీంతో దిల్ రాజు సూచనతో.. వేణు కథలో కొద్ది మార్పులు చేసి శర్వానంద్ కి వినిపించగా.. ఆయన ఓకే చెప్పినట్లు సమాచారం. అన్ని అనుకున్నట్లు కుదిరితే త్వరలోనే ఈ ప్రాజెక్ట్ అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది అంటున్నారు.

కాగా, దిల్ రాజు బ్యానర్ లో గతంలో శర్వానంద్ 'శతమానంభవతి', 'జాను' సినిమాలు చేశాడు. వాటిలో 'శతమానంభవతి' ఘన విజయం సాధించింది.