English | Telugu
'జై హనుమాన్'లో రవితేజ..!
Updated : Jun 29, 2024
తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో రూపొందిన సూపర్ హీరో మూవీ 'హనుమాన్' (Hanuman) ఈ ఏడాది జనవరిలో విడుదలై ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) లో భాగంగా మొదటి సినిమాగా వచ్చింది 'హనుమాన్'. దీనికి సీక్వెల్ గా 'జై హనుమాన్' (Jai Hanuman) రానుందని ఇప్పటికే ప్రకటించారు. అయితే ఈ సినిమా కంటే ముందు బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ తో ఓ మూవీ ప్లాన్ చేశాడు ప్రశాంత్. కానీ ఏవో కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. దీంతో 'జై హనుమాన్' పై మళ్ళీ ఫోకస్ పెడుతున్నాడు ఈ టాలెంటెడ్ డైరెక్టర్. అంతేకాదు ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ (Raviteja) నటించే అవకాశముందని తెలుస్తోంది.
కంటెంట్ పరంగా, బడ్జెట్ పరంగా 'హనుమాన్' ని మించి ఎన్నో రెట్లు 'జై హనుమాన్' ఉంటుందని గతంలోనే దర్శకుడు ప్రశాంత్ వర్మ చెప్పాడు. అంతేకాదు, 'జై హనుమాన్'లో స్టార్స్ నటిస్తారని తెలిపాడు. అన్నట్టుగానే ఈ సినిమా కోసం స్టార్స్ ని రంగంలోకి దింపే పనిలో ప్రశాంత్ ఉన్నాడట. రీసెంట్ గా రవితేజను కలిసిన ప్రశాంత్ వర్మ.. 'జై హనుమాన్' కథ గురించి చర్చించినట్లు టాక్. ఈ సినిమాలో రవితేజ భాగం కావడం ఖాయమని న్యూస్ వినిపిస్తోంది.
'జై హనుమాన్'లో హనుమంతుడి పాత్రలో ఒక స్టార్ కనిపిస్తాడని ప్రశాంత్ వర్మ చెప్పగా.. ఆ పాత్రలో రానా దగ్గుబాటి (Rana Daggubati) కనిపిస్తాడని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అలాంటిది ఇప్పుడు రవితేజతో ప్రశాంత్ సంప్రదింపులు జరిపాడనే వార్త ఆసక్తికరంగా మారింది. మరి 'జై హనుమాన్'లో రవితేజ హనుమంతుడి పాత్రలో కనిపిస్తారా? లేక సూపర్ హీరో తరహా పాత్రలో కనిపిస్తారా? అనేది త్వరలో తెలిసే అవకాశముంది.