English | Telugu
'బేబీ'కి బంపర్ ఆఫర్.. రామ్ కి జోడీగా ఛాన్స్!
Updated : Aug 4, 2023
అటు చెల్లి పాత్రలోనూ.. ఇటు చెలి పాత్రలోనూ సంచలన విజయాలు అందుకున్న వైనం తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య సొంతం. 2020 సంక్రాంతికి రిలీజై బ్లాక్ బస్టర్ గా నిలిచిన 'అల వైకుంఠపురములో' చిత్రంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి చెల్లెలిగా అలరించిన వైష్ణవి.. గత నెలలో విడుదలై అఖండ విజయం సాధించిన 'బేబీ'లో హీరోయిన్ గా ఆకట్టుకుంది. దీంతో.. వైష్ణవికి 'గోల్డెన్ లెగ్' ఇమేజ్ వచ్చింది.
'బేబీ' తరువాత ఆచితూచి అడుగులు వేస్తున్న వైష్ణవి చైతన్యకి తాజాగా ఓ క్రేజీ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా నటించే ఛాన్స్ దక్కిందట. ఆ వివరాల్లోకి వెళితే.. 2019 సెన్సేషనల్ హిట్ 'ఇస్మార్ట్ శంకర్'కి సీక్వెల్ గా 'డబుల్ ఇస్మార్ట్' పేరుతో డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఓ సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా కొనసాగుతుండగా.. విలన్ గా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కనిపించనున్నాడు. 'ఇస్మార్ట్ శంకర్' తరహాలో 'డబుల్ ఇస్మార్ట్'లోనూ ఇద్దరు నాయికలకు స్థానముందట. వారిలో ఒకరిగా 'బేబీ' ఫేమ్ వైష్ణవి చైతన్యని ఎంపిక చేశారని ప్రచారం సాగుతోంది. మరి.. ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే. కాగా, 'డబుల్ ఇస్మార్ట్' మార్చి 8న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది.