English | Telugu

మెగాస్టార్‌తో అనిల్‌ రావిపూడి సినిమా... ఓ రేంజ్‌లో ఉంటుందట?

ఈమధ్య టాలీవుడ్‌ టాప్‌ డైరెక్టర్స్‌ తమ సినిమాల విషయంలో ఎంతో కేర్‌ తీసుకుంటున్నారని అర్థమవుతోంది. కాంబినేషన్‌ సెట్‌ చేసుకునే విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. ఏం చేసినా, ఎలా చేసినా సక్సెస్‌ అనేదే టార్గెట్‌గా పెట్టుకొని తమ కెరీర్‌ని ప్లాన్‌ చేసుకుంటున్నారు. ఆ విషయంలో అనిల్‌ రావిపూడి గురించి ముందుగా చెప్పుకోవాలి. ‘పటాస్‌’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన అనిల్‌ ఆ తర్వాత తన ప్రతి సినిమాలోనూ విభిన్నమైన అంశాలు ఉండేలా చూసుకుంటున్నాడు. అంతేకాదు, తను ఎంచుకున్న కథకు కరెక్ట్‌గా సెట్‌ అయ్యే హీరోతోనే సినిమా చేస్తున్నాడు. దాంతో అతన్ని విజయం వరిస్తోంది. తన సినిమాల్లో ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రధానంగా ఉండేలా చూసుకునే అనిల్‌ ఇటీవల మాస్‌ అండ్‌ యాక్షన్‌ హీరో నందమూరి బాలకృష్ణతో చేసిన ‘భగవంత్‌ కేసరి’తో భారీ హిట్‌ కొట్టి అందరికీ షాక్‌ ఇచ్చాడు. 

ఇప్పుడు మరో కొత్త కాంబినేషన్‌ని సెట్‌ చేసుకునే పనిలో పడ్డాడు అనిల్‌. మెగాస్టార్‌ చిరంజీవితో అతను త్వరలోనే ఓ సినిమా ఎనౌన్స్‌ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ విషయం ఇప్పుడు ఫిలింనగర్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ సినిమాని దిల్‌రాజు నిర్మించే అవకాశం ఉందని సమాచారం. ఎందుకంటే ఎప్పటినుంచో తన అభిమాన హీరో చిరంజీవితో సినిమా చెయ్యాలని ఆసక్తిగా ఉన్నాడు దిల్‌రాజు. ఆ దిశగా ఎన్నో ప్రయత్నాలు కూడా చేశాడు. అయితే అనిల్‌ రావిపూడి ద్వారా దిల్‌ రాజు కోరిక నెరవేరేలా కనిపిస్తోంది. ఆల్రెడీ రామ్‌చరణ్‌తో దిల్‌రాజు తన 50వ సినిమా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మెగాస్టార్‌ చిరంజీవితో కూడా సినిమా సెట్‌ అయిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన స్టోరీ డిస్కషన్స్‌ జరుగుతున్నాయని సమాచారం. 

సింగిల్‌ లైన్‌ విని నచ్చడంతో ఓకే చెప్పిన చిరంజీవి ఫైనల్‌ వెర్షన్‌ విన్న తర్వాత ఈ ప్రాజెక్ట్‌ని ఎప్పుడు మొదలు పెట్టాలి అనేది నిర్ణయిస్తారట. కథ ఓకే అయిన తర్వాతే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అఫీషియల్‌ ఎనౌన్స్‌మెంట్‌ వస్తుందని తెలుస్తోంది. చిరంజీవి యాక్షన్‌ సినిమాలకు ఎంత కరెక్ట్‌గా సరిపోతాడో కామెడీ సినిమాలకు కూడా సెట్‌ అవుతాడు. గతంలో చంటబ్బాయ్‌ వంటి సినిమాలే దానికి ఉదాహరణ. డిఫరెంట్‌ కాన్సెప్ట్స్‌లో కామెడీ ట్రాక్స్‌ని డీల్‌ చేయడం, వాటిని స్క్రీన్‌పై అద్భుతంగా ప్రజెంట్‌ చేయడంలో సిద్ధహస్తుడైన అనిల్‌ రావిపూడితో చిరంజీవి సినిమా అంటే అందులో కామెడీ పుష్కలంగా ఉంటుందని ఆశించవచ్చు. ఓ ఇంటర్వ్యూలో కూడా అనిల్‌ రావిపూడి చిరంజీవితో సినిమా చేసే ఛాన్స్‌ వస్తే ఆయన్ని ఒక రేంజ్‌లో చూపిస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు చిరంజీవి కాంబినేషన్‌ని సెట్‌ చేసుకుంటున్న అనిల్‌ ఏ తరహా సినిమా చెయ్యాలని ప్లాన్‌ చేస్తున్నాడనే విషయం తెలియాల్సి ఉంది. ఇక దిల్‌రాజు విషయానికి వస్తే పవన్‌కళ్యాణ్‌తో సినిమా చెయ్యాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. అది వకీల్‌సాబ్‌తో తీరింది. ఇప్పుడు చిరంజీవితో తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ని సెట్‌ చేసుకునే పనిలో బిజీగా ఉన్నాడు దిల్‌రాజు.