English | Telugu

సడెన్ గా క్రేజీ ప్రాజెక్ట్ ని ఆపేసిన మైత్రి.. అసలేం జరిగింది?

'డాన్ శీను', 'బలుపు', 'క్రాక్' వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేని నాలుగోసారి చేతులు కలిపిన సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. ప్రకటనతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. మాస్ రాజా-మలినేని కాంబోలో నాలుగో హిట్ రావడం ఖాయమనే అంచనాలు అందరిలో ఏర్పడ్డాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ వినిపిస్తోంది. అదేంటంటే ఈ సినిమా ఆగిపోయిందట.

కమర్షియల్ డైరెక్టర్ గా గోపీచంద్ మలినేనికి మంచి పేరే ఉంది. ముఖ్యంగా రవితేజతో ఆయన ట్రాక్ రికార్డు బాగుంది. అయితే ఇప్పటిదాకా మలినేని చేసిన సినిమాలన్నీ హీరో మార్కెట్ కు మించకుండా ప్రొడ్యూసర్స్ ని సేఫ్ జోన్ లో ఉంచేలా తీసిన బడ్జెట్ సినిమాలే. కానీ ఇప్పుడు రవితేజతో చేయాలనుకున్న నాలుగో సినిమా విషయంలో మాత్రం బడ్జెట్ లెక్క చాలా పెరిగిందట. ఈ మూవీ బడ్జెట్ ఏకంగా రూ.120 కోట్లని అంచనా. కానీ ప్రస్తుతం రవితేజ మార్కెట్ ని పరిగణలోకి తీసుకుంటే.. థియేట్రికల్, నాన్-థియేట్రికల్ రైట్స్ కలిపినా ఆ మొత్తం రాదనేది వాస్తవం.

మాస్ రాజా రీసెంట్ మూవీ 'టైగర్ నాగేశ్వరరావు' బాక్సాఫీస్ దగ్గర రూ.25 కోట్ల షేర్ కే పరిమితమైంది. పైగా ఇది పాన్ ఇండియా సినిమా. అయినా కనీస వసూళ్లు రాబట్టలేకపోయింది. ఇక రవితేజ కెరీర్ లో ఇప్పటిదాకా అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రం 'ధమాకా'. ఇది వరల్డ్ వైడ్ గా రూ.45 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. 

కాంబినేషన్ క్రేజ్, మంచి కంటెంట్ కలిసి సినిమా మీద బోలెడంత హైప్ క్రియేట్ అయినా.. మాస్ రాజా-మలినేని కాంబో సినిమా రూ.50 కోట్ల థియేట్రికల్ బిజినెస్ కూడా చేయడం కష్టమే. ఒకవేళ చేసినా, రిజల్ట్ తేడా కొడితే ఆ మొత్తంలో సగం కూడా రాబట్టే పరిస్థితి ఉండదు. పైగా పెట్టిన బడ్జెట్ ప్రొడ్యూసర్స్ రాబట్టాలంటే నాన్-థియేట్రికల్ రైట్స్ ద్వారా మరో రూ.70 కోట్లు రావాల్సి ఉంటుంది. ఈ లెక్కలన్నీ ఆలోచించిన మేకర్స్ చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం ఎందుకని.. ముందే జాగ్రత్త పడి, ప్రస్తుతానికి ప్రాజెక్ట్ ని నిలిపి వేయాలని నిర్ణయించుకున్నారట.

మరి మాస్ రాజా-మలినేని కాంబినేషన్ లోనే వేరే కథతో పరిమిత బడ్జెట్ తో మైత్రి మరో సినిమాని ప్లాన్ చేస్తుందేమో చూడాలి. ఎందుకంటే మైత్రి దగ్గర ఈ ఇద్దరి డేట్స్ ఉన్నాయి. లేదంటే మలినేనితో మరో హీరోని జత చేసి, రవితేజ కోసం వేరే దర్శకుడిని రంగంలోకి దింపుతారేమో చూడాలి.