English | Telugu
ఎన్టీఆర్ 'దేవర'లో అల్లు అర్హ!
Updated : Jul 17, 2023
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ 'శాకుంతలం' సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో ఆమె ప్రిన్స్ భరత పాత్రలో ముద్దు ముద్దు మాటలతో ఆకట్టుకుంది. ఇప్పుడు అర్హ మరోసారి వెండితెరపై అలరించడానికి సిద్ధమవుతోంది. ఈసారి ఏకంగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో నటించే అవకాశం దక్కించుకుందని సమాచారం.
'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కలయికలో రూపొందుతోన్న సినిమా 'దేవర'. 'ఆర్ఆర్ఆర్'తో గ్లోబల్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఎన్టీఆర్ నుంచి వస్తున్న తదుపరి సినిమా కావడంతో 'దేవర'పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. ఇందులో అల్లు అర్హ సందడి చేయనుందట. 'దేవర'లో బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, ఆమె చిన్నప్పటి పాత్రలో అర్హ కనిపించనుందని ఇన్ సైడ్ టాక్.
తారక్, బన్నీ మధ్య ఎంతటి అనుబంధముందో తెలిసిందే. ఇద్దరూ ఒకరినొకరు బావ అని ఎంతో ఆప్యాయంగా పిలుచుకుంటారు. ఇప్పుడు తారక్ సినిమాలో బన్నీ గారాలపట్టి నటించనుందనే వార్తతో ఇరు హీరోల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న దేవర సినిమాకి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా 2024 ఏప్రిల్ 5 న పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కానుంది.