English | Telugu
విడాకుల నేపథ్యంలో నాగ చైతన్య సినిమా.. రియల్ స్టోరీనా!
Updated : Jul 17, 2023
'థాంక్యూ', 'కస్టడీ' వంటి వరుస ఘోర పరాజయాలను ఎదుర్కొన్న అక్కినేని నాగచైతన్య స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని పట్టుదలగా ఉన్నాడు. అందుకే అదిరిపోయే లైనప్ తో వస్తున్నాడు. చైతన్య తన తదుపరి సినిమాని చందు మొండేటి దర్శకత్వంలో చేయనున్నాడు. 'కార్తికేయ 2'తో పాన్ ఇండియా సక్సెస్ ని అందుకున్న చందు, ఆ జోష్ ని కొనసాగిస్తూ చైతన్యకి కూడా మంచి విజయాన్ని అందిస్తాడేమో చూడాలి. దీని తర్వాత తనకు 'మజిలీ' వంటి గుర్తుండిపోయే సినిమాని అందించిన శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు చైతన్య. ఇది చైతన్య కెరీర్ లో 25వ రూపొందనుందట. దీని తర్వాత మరో ఆసక్తికర ప్రాజెక్ట్ లో చైతన్య నటించబోతున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల 'సామజవరగమన' చిన్న సినిమాగా విడుదలై ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఈ సినిమాతో దర్శకుడు రామ్ అబ్బరాజు అందరి దృష్టిని ఆకర్షించాడు. కుటుంబమంతా చూసి ఆనందించదగ్గ క్లీన్ ఎంటర్టైనర్ ని అందించిన రామ్ పై ప్రశంసలు కురిశాయి. అదే సమయంలో ఆయన తదుపరి చిత్రం ఎవరితోనన్న ఆసక్తి అందరిలో నెలకొంది. రామ్ అబ్బరాజు తన తదుపరి సినిమాని చైతన్యతో చేయనున్నాడని సమాచారం. ఇప్పటికే రామ్ చెప్పిన స్టోరీ లైన్ కి చైతన్య ఓకే చెప్పాడని వినికిడి. అయితే ఇప్పుడు ఈ స్టోరీ లైన్ గురించి ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ కథ విడాకుల నేపథ్యంలో ఉంటుందట. నిజజీవితంలో సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న చైతన్య, కొన్నేళ్ళకే విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు విడాకుల నేపథ్యంలో చైతన్య సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడన్న వార్త హాట్ టాపిక్ గా మారింది. ఈ కథకి చైతన్య నిజ జీవితానికి ఏమైనా సంబంధం ఉందా? ఈ విడాకుల కథను రామ్ అబ్బరాజు ఎలా నడిపిస్తాడు? 'సామజవరగమన' తరహాలో కామెడీ టచ్ ఇస్తాడా లేక ఎమోషనల్ గా తీసుకెళ్తాడా? వంటి చర్చలు జరుగుతున్నాయి.