English | Telugu
అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్!
Updated : Jul 16, 2023
మెగాస్టార్ చిరంజీవి కుర్ర హీరోలతో పోటీ పడుతూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఆయన ఆగస్టు 11న 'భోళా శంకర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దీని తర్వాత కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో సినిమా మొదలుపెట్టనున్నారు. అలాగే డైరెక్టర్ మల్లిడి వశిష్ట్ ప్రాజెక్ట్ కూడా లైన్ లో ఉంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ లిస్టులోకి అనిల్ రావిపూడి వచ్చి చేరినట్లు తెలుస్తోంది.
టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ దర్శకులలో ఒకరిగా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి.. ప్రస్తుతం నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా 'భగవంత్ కేసరి' సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాది దసరాకు విడుదల కానుంది. దీని తర్వాత ఆయన చేయబోయే సినిమా చిరంజీవితోనే అని న్యూస్ వినిపిస్తోంది. ఇప్పటికే అనిల్ చెప్పిన స్టోరీ లైన్ చిరంజీవికి నచ్చిందని, 'భగవంత్ కేసరి' విడుదలయ్యాక అనిల్ పూర్తి స్క్రిప్ట్ ని సిద్ధం చేసి చిరుకి వినిపిస్తారని టాక్. అన్ని అనుకున్నట్టు జరిగితే వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం.