English | Telugu
బాలీవుడ్ లోకి తాప్సీ
Updated : Apr 5, 2011
బాలీవుడ్ లోకి హీరోయిన్ తాప్సీ వెళుతూందట. తెలుగులో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో, మంచు మనోజ్ కుమార్ హీరోగా నటించగా, లక్ష్మీ ప్రసన్న నిర్మించిన "ఝుమ్మంది నాదం" చిత్రం ద్వారా వెండి తెరకు పరిచయమైంది హీరోయిన్ తాప్సి. అనంతరం మంచు విష్ణు వర్థన్ హీరోగా నటించగా, హేమంత్ మధుకర్ దర్శకత్వంలో నిర్మించిన "వస్తాడు నారాజు" చిత్రంలో కూడా తాప్సి హీరోయిన్ నటించింది. కానీ ఆ రెండు చిత్రాలూ తాప్సికి హిట్టివ్వలేక పోయాయి. ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా, దశరథ్ దర్శకత్వంలో, దిల్ రాజు నిర్మిస్తున్న "మిస్టర్ పర్ ఫెక్ట్" చిత్రంలో తాప్సి హీరోయిన్ గా నటిస్తూంది. ఈ చిత్రం ఇంకా విడుదల కావలసి ఉంది.
అయితే అలాంటి అప్ కమింగ్ హీరోయిన్ తాప్సికి బాలీవుడ్ నుండి బంపర్ ఆఫర్ ఒకటి వచ్చింది. బాలీవుడ్లో ప్రముఖ దర్శకుడు డేవిడ్ ధావన్ దర్శకత్వం వహించబోయే చిత్రంలో తాప్సికి హీరోయిన్ గా అవకాశం లభించింది. అది కూడా ఉగాది పండుగ రోజునట. ఇంతకీ తాప్సీ నటించబోయే తొలి హిందీ చిత్రం పేరు "చష్మ బద్దూర్" అట. మొన్న జెనీలియా, నిన్న ఇలియానా, తర్వాత కాజల్ అగర్వాల్ ఇప్పుడు తాప్సి... చూడగా చూడగా తెలుగు సినిమాలు హిందీ సినిమాల్లో ప్రవేశించటానికి ముఖద్వారంలా పనిచేస్తున్నట్టుంది.