English | Telugu
పెళ్లికొడుకు రెడీ.. అనుష్క గ్రీన్ సిగ్నల్ కోసం వెయిటింగ్!
Updated : Jul 26, 2024
2005లో ‘సూపర్’ చిత్రం ద్వారా చిత్ర రంగ ప్రవేశం చేసిన అనుష్క చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. అనుష్క తప్ప ఆ క్యారెక్టర్ ఎవ్వరూ చెయ్యలేరు అనేంతగా ప్రేక్షకుల్ని తన నటనతో మెప్పించింది. 2017 వరకు బిజీ హీరోయిన్‌గా ఉన్న అనుష్కకు ఆ తర్వాత అవకాశాలు తగ్గాయి. సంవత్సరానికి ఒక సినిమా మాత్రమే చేస్తూ వస్తోంది. ఇప్పటివరకు తెలుగు, తమిళ సినిమాల్లో మాత్రమే నటించింది అనుష్క. కర్ణాటక నుంచి వచ్చిన ఆమె ఒక్క కన్నడ సినిమాలో కూడా నటించకపోవడం విశేషం. ‘కథనార్’ పేరుతో మలయాళంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తోంది అనుష్క. ఈ సినిమా డిసెంబర్‌లో విడుదల కానుంది. అనుష్క కెరీర్ ఇలా ఉంటే.. వ్యక్తిగతంగా జీవితంలో ఆమె ఇప్పటివరకు స్థిరపడలేకపోయింది.
రెబల్‌స్టార్ ప్రభాస్‌తో బిల్లా, మిర్చి, బాహుబలి సిరీస్‌లో కలిసి నటించిన అనుష్క అతన్నే పెళ్ళి చేసుకోబోతోందనే వార్తలు అప్పట్లో గుప్పుమన్నాయి. అప్పుడప్పుడు గ్యాప్ తీసుకొని ప్రభాస్, అనుష్క పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఆమధ్య ప్రభాస్, అనుష్కల పెళ్లి జరిగిపోయింది అన్నట్టుగా క్రియేట్ చేసిన ఫోటోలు సంచలనం సృష్టించాయి. ఈ వార్తలపై స్పందించిన అనుష్క.. తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమే అంటూ చెప్పుకొస్తోంది. అయితే ప్రేక్షకులు, అభిమానులు మాత్రం అనుష్క చెప్పిన మాటల్ని నమ్మడంలేదు. ఎందుకంటే ఇప్పుడామె వయసు 42 సంవత్సరాలు. ఇంతకాలం పెళ్లి చేసుకోకుండా ఉందంటే అది ప్రభాస్ కోసమేననే వార్తలు కూడా మనకు వినిపిస్తుంటాయి. ఈ విషయంలో ఇప్పటివరకు ప్రభాస్ నోరు విప్పకపోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం.
ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఓ కొత్త వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే.. అనుష్క కుటుంబ సభ్యులు ఆమె పెళ్లి కోసం తొందరపడుతున్నారట. అందుకే గత కొంతకాలంగా సంబంధాలు చూస్తున్నారు. ఫైనల్‌గా ఓ బిజినెస్ మేన్‌ని సెలెక్ట్ చేశారట. అనుష్క కుటుంబ సభ్యులందరికీ ఈ సంబంధం నచ్చిందని తెలుస్తోంది. వరుడు కూడా అనుష్కను పెళ్లి చేసుకునేందుకు ఉత్సాహం చూపిస్తున్నాడట. అంతవరకు బాగానే ఉంది కానీ, ఇప్పటివరకు ఈ విషయంలో అనుష్క అవునని, కాదని చెప్పలేదట. అందుకే అంతా అనుష్క ఇచ్చే గ్రీన్ సిగ్నల్ కోసమే ఎదురుచూస్తున్నారని తెలుస్తోంది.