English | Telugu
నేతాజీ సుభాష్ చంద్రబోస్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్!
Updated : Jul 25, 2024
ఈ తరం స్టార్ హీరోలలో ఎలాంటి పాత్రనైనా పోషించి మెప్పించగల నటుడిగా జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కి పేరుంది. ఇప్పటికే పలు విభిన్న పాత్రలు పోషించి గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్నాడు ఎన్టీఆర్. ఇప్పుడు భారత స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ (Netaji Subhas Chandra Bose) పాత్రలో నటించనున్నాడనే వార్త సంచలనంగా మారింది.
ప్రస్తుతం ఎన్టీఆర్ చేతిలో 'దేవర', 'వార్ 2', 'డ్రాగన్' సినిమాలు ఉన్నాయి. వీటితో పాటు ప్రభాస్ (Prabhas) అప్ కమింగ్ మూవీలో నేతాజీ పాత్ర పోషించడానికి ఎన్టీఆర్ సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి 'ఫౌజీ' అనే టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం. భారతదేశానికి స్వాతంత్య్రం రావడానికి ముందునాటి కథతో ఈ చిత్రం రూపొందుతోంది. 1943 ప్రాంతంలో సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలోని 'ఆజాద్ హింద్ ఫౌజ్'లో ఒక సైనికుడిగా ప్రభాస్ కనిపిస్తాడట. అంతేకాదు, ఈ సినిమాలో నేతాజీ పాత్ర కూడా కాసేపు కనిపిస్తుందట.
నేతాజీ పాత్రను ఎన్టీఆర్ లాంటి స్టార్ చేస్తే బాగుందన్న ఉద్దేశంతో మూవీ టీం ఆయనను సంప్రదించగా.. ఈ రోల్ చేయడానికి ఎన్టీఆర్ సుముఖుత వ్యక్తం చేసినట్లు వినికిడి. ఎన్టీఆర్ అంటే హను రాఘవపూడికి ప్రత్యేక అభిమానం. గతంలో ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి ప్రయత్నించాడు కానీ.. ఎందుకనో సాధ్యంకాలేదు. అయితే ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ పాత్రకి ఎన్టీఆర్ సరిగ్గా సరిపోతాడని భావించి హను రాఘవపూడి అడగటం.. ఎన్టీఆర్ ఒప్పుకోవడం చకచకా జరిగిపోయాయని అంటున్నారు. అదే నిజమైతే.. నేతాజీగా ఎన్టీఆర్, సైనికుడిగా ప్రభాస్ స్క్రీన్ మీద కనిపిస్తే.. కన్నుల పండుగలా ఉంటుంది అనడంలో సందేహం లేదు.