English | Telugu

నందమూరి బాలకృష్ణ, రామ్‌ పోతినేని మల్టీస్టారర్‌.. రెడీగా ఉన్న ఇద్దరు డైరెక్టర్లు?

పాత జనరేషన్‌కి చెందిన హీరోల్లో నందమూరి బాలకృష్ణ ఒక్కరే వరస విజయాలతో యంగ్‌ హీరోలకు సైతం గట్టి పోటీ ఇస్తున్నారు. ‘తాతమ్మకల’ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైన బాలకృష్ణ ఆగస్ట్‌ 30తో 50 ఏళ్ల సినీ కెరీర్‌ని పూర్తి చేసుకోబోతున్నారు. సెప్టెంబర్‌ 1న బాలయ్య గోల్డెన్‌ జూబ్లీ ఇయర్‌ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరగనుంది. ఈ నేపథ్యంలో ఓ కొత్త వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. నందమూరి బాలకృష్ణ, రామ్‌ పోతినేని కాంబినేషన్‌లో ఓ మల్టీస్టారర్‌ చేసేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌ రంగం చేస్తున్నట్టు తెలుస్తోంది. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్‌ కేసరి వంటి పవర్‌ఫుల్‌ సినిమాలతో మాస్‌లో తిరుగులేని ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు బాలయ్య. అప్పటివరకు లవర్‌బోయ్‌ ఇమేజ్‌తో సినిమాలు చేస్తూ వస్తున్న రామ్‌ను ‘ఇస్మార్ట్‌ శంకర్‌’తో మాస్‌ హీరోగా టర్న్‌ చేసిన పూరి జగన్నాథ్‌ ఇప్పుడు మాస్‌లో రామ్‌ ఇమేజ్‌ను డబుల్‌ చేసేందుకు ‘డబుల్‌ ఇస్మార్ట్‌’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా ఆగస్ట్‌ 15న విడుదల కాబోతోంది. 

ఇదిలా ఉంటే.. ఈ ఇద్దరు మాస్‌ హీరోలతో ఓ మల్టీస్టారర్‌ రాబోతోంది అనే వార్త నందమూరి అభిమానుల్లో, రామ్‌ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఇందులో నిజమెంత ఉందనేది పక్కన పెడితే.. ఈ ఇద్దరూ కలిసి సినిమా చేస్తే దాని ఎఫెక్ట్‌ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెపక్కర్లేదు. బాలకృష్ణకు, రామ్‌కు వయసులో ఎంతో డిఫరెన్స్‌ ఉన్నప్పటికీ ఇద్దరూ మంచి స్నేహితులు. బాలయ్యతో మంచి స్నేహం ఉన్న ఏకైక యంగ్‌ హీరో రామ్‌. ఇప్పుడు ఆ స్నేహంతోనే ఇద్దరూ కలిసి సినిమా చెయ్యాలని డిసైడ్‌ అయ్యారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ మల్టీస్టారర్‌ చేసేందుకు ఇద్దరు డైరెక్టర్లు సిద్ధంగా ఉన్నారనేది మరో ఆసక్తికరమైన వార్త. గోపీచంద్‌ మలినేని, బోయపాటి శ్రీను.. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు ఈ సినిమా చేస్తారన్న టాక్‌ వినిపిస్తోంది. 

బాలకృష్ణతో గోపీచంద్‌ మలినేని ‘వీరసింహారెడ్డి’ వంటి సూపర్‌హిట్‌ని తీసారు. అలాగే బోయపాటి శ్రీను ‘సింహా’, ‘లెజెండ్‌’, ‘అఖండ’ వంటి బ్లాక్‌బస్టర్స్‌ చేసి హ్యాట్రిక్‌ కొట్టారు. ఇప్పుడు ‘అఖండ2’ని తెరకెక్కించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు బోయపాటి. ఇక రామ్‌ పోతినేనితో ‘స్కంద’ వంటి హై ఓల్టేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చేసిన బోయపాటి అతనికి భారీ విజయాన్ని అందించలేకపోయారు. ‘వీరసింహారెడ్డి’ టైమ్‌లోనే గోపీచంద్‌ మలినేనితో మరో సినిమా చేస్తామని మైత్రి మూవీ మేకర్స్‌ అధినేతలు మాటిచ్చారు. ఆ సినిమాలో నటించేందుకు బాలయ్య కూడా ఓకే చెప్పారు. దీనికి సంబంధించిన కథ కూడా ఓకే అయ్యిందన్న వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాలకృష్ణ, రామ్‌ మల్టీస్టారర్‌ తెరపైకి వచ్చింది. మైత్రి సంస్థకు గోపీచంద్‌ చేసే సినిమా ఇదేనని తెలుస్తోంది. 

మరోపక్క బాలయ్యతో ‘అఖండ2’ చిత్రాన్ని చేయబోతున్న బోయపాటి పేరు కూడా ఈ మల్టీసారర్‌కి వినిపిస్తోంది. ప్రస్తుతం బాలయ్య తన 109వ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఇది పూర్తయిన తర్వాత ‘అఖండ2’ ప్రారంభమవుతుంది. దీన్ని కూడా కంప్లీట్‌ చేసి ఈ భారీ మల్టీస్టారర్‌ని డైరెక్ట్‌ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. బాలయ్య, రామ్‌ కలిసి నటించబోతున్నారన్న వార్త నిజమేనని, అయితే ఈ ఇద్దరిలో డైరెక్టర్‌గా ఎవరిని సెలెక్ట్‌ చేసుకుంటారనే విషయమే తేలాల్సి ఉందని చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనా మైత్రి మూవీ మేకర్స్‌ ఈ భారీ ప్రాజెక్ట్‌కి సంబంధించి అధికారిక ప్రకటన చేస్తే తప్ప ఈ మల్టీస్టారర్‌లో ఎంత నిజం ఉందనేది తెలియదు.