English | Telugu

16 ఏళ్ళ తరువాత మెగాస్టార్ తో.. ఆ బ్లాక్ బస్టర్స్ ని మరిపించేనా!

ఈ ఏడాది 'వాల్తేరు వీరయ్య', 'భోళా శంకర్' చిత్రాలతో పలకరించారు మెగాస్టార్ చిరంజీవి. వీటిలో 'వాల్తేరు వీరయ్య' బ్లాక్ బస్టర్ కాగా, 'భోళా శంకర్' డిజాస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం చిరు సినిమాలేవీ సెట్స్ పై లేవు. స్క్రిప్ట్ దశలో మాత్రం రెండు చిత్రాలున్నాయి. అందులో ఒకటి కళ్యాణ కృష్ణ కాంబినేషన్ మూవీ కాగా.. మరొకటి 'బింబిసార' ఫేమ్ వశిష్ట కాంబో ఫిల్మ్. అయితే, ఈ రెండు సినిమాలకి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

ఇదిలా ఉంటే, వశిష్టతో చేయనున్న మెగా మూవీకి సంబంధించి ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే.. నవంబర్ నుంచి పట్టాలెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి ప్రముఖ ఛాయాగ్రాహకుడు ఛోటా కె. నాయుడు సినిమాటోగ్రఫీ అందించనున్నారట. అదే గనుక నిజమైతే.. బ్లాక్ బస్టర్ కాంబో రిపీట్ కాబోతున్నట్లే. ఇప్పటికే చిరంజీవి, ఛోటా కె నాయుడు కలయికలో 'మాస్టర్', 'చూడాలని వుంది', 'అన్నయ్య', 'ఠాగూర్' వంటి సంచలన విజయాలు నమోదయ్యాయి. వీటితో పాటు 'డాడీ', 'అంజి', 'స్టాలిన్', 'శంకర్ దాదా జిందాబాద్' వంటి సినిమాలు కూడా ఈ కాంబోలో వచ్చాయి. మరి.. 'శంకర్ దాదా జిందాబాద్' (2007) విడుదలైన 16 ఏళ్ళ అనంతరం మళ్ళీ జట్టుకట్టనున్న చిరు, ఛోటా.. ఈసారి వారి కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్స్ ని మరిపించే సక్సెస్ ని అందుకుంటారేమో చూడాలి.