English | Telugu

పుష్ప 2 కి వంద కోట్లు నష్టం అనే వార్త నిజమేనా!

అల్లు అర్జున్‌(allu arjun)వన్ మాన్ షో పుష్ప 2(pushpa 2) డిసెంబర్ 6 న వరల్డ్ వైడ్ గా విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో  ఈ నెల చివరికల్లా షూటింగ్‌ కి గుమ్మడి కాయ కొట్టేసి ప్రమోషన్స్ ని స్టార్ట్ చెయ్యాలనే పట్టుదలతో మేకర్స్ ఉన్నారు.ఈ మేరకు బ్యాలన్స్ షూట్‌ను మూడు యూనిట్‌లు వైజాగ్‌, యానాం, రంపచోడవరం వంటి ఏరియాల్లో చిత్రీకరిస్తున్నారని తెలుస్తుంది. కీలక సన్నివేశాలకు సుకుమార్‌(sukumar)దర్శకత్వం వహిస్తూ ఉండగా, వేరే చోట జరుగుతున్న ప్యాచ్ వర్క్‌ షూట్‌ని ఆయన టీం నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఇక  లేటెస్ట్ గా ఫిలిం సర్కిల్స్ ల్లో పుష్ప 2 కి సంబంధించిన న్యూస్ ఒకటి చక్కర్లు కొడుతుంది. ఆగస్టు 15 న విడుదల కావలసిన ఈ మూవీ ఆరు నెలల ఆలస్యం కారణంగా దాదాపుగా 100 కోట్లకు పైగా బడ్జట్ పెరిగిందనే టాక్  వినిపిస్తోంది. అల్లు అర్జున్‌ తో పాటు దాదాపు అందరు నటీనటులు ముందుగా కమిట్‌ అయిన డేట్ల కంటే ఎక్కువ డేట్లను పుష్ప 2 కోసం ఇవ్వాల్సి వచ్చిందట.దీంతో పారితోషికాలను అదనంగా ఇవ్వాల్సి రావడంతో పాటుగా సెట్‌ వర్క్‌, ప్రొడక్షన్ ఖర్చు కూడా  భారీగా పెరిగిందని  అంటున్నారు. అంతే కాకుండా యాక్షన్‌ సన్నివేశాలను మొదట అనుకున్నట్లు కాకుండా మరింత రియలిస్టిక్‌గా చిత్రీకరించేందుకు సుకుమార్‌ అదనపు బడ్జెట్‌ను ఖర్చు చేయడం కూడా ఒక కారణం అని తెలుస్తుంది. అందుకే 350 ,400 కోట్ల బడ్జెట్‌ తో పూర్తి కావాల్సిన మూవీ 500 కోట్ల బడ్జెట్‌ దాటిందని, ప్రమోషన్స్‌ ఇతర ఖర్చులు అదనం అనే టాక్‌ కూడా వినిపిస్తుంది.

పుష్ప పార్ట్ 1 ని నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్  సంస్థనే పార్ట్ 2 ని కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా అల్లు అర్జున్ సరసన రష్మిక(rashmikha)జోడి కట్టింది.ఇప్పటికే వచ్చిన రెండు పాటలు రికార్డు వ్యూయర్స్ తో ముందుకు దూసుకుపోతుండగా ఐటెం సాంగ్ ఏ హీరోయిన్ చేస్తుందన్న క్యూరియాసిటీ అందరిలో ఉంది.