English | Telugu

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఆమిర్ ఖాన్.. ఊహించని కాంబో!

ఇటీవల సౌత్ దర్శకులతో సినిమాలు చేయడానికి బాలీవుడ్ స్టార్లు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే అట్లీతో షారుఖ్ ఖాన్, సందీప్ రెడ్డి వంగాతో రణబీర్ కపూర్ సినిమాలు చేశారు. అలాగే మురుగదాస్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ ఓ సినిమా చేస్తున్నాడు. ఇక ఇప్పుడు ఆమిర్ ఖాన్ (Aamir Khan) వంతు వచ్చింది. టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి (Vamshi Paidipally)తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

జూనియర్ ఎన్టీఆర్(Jr NTR)తో 'బృందావనం', రామ్ చరణ్(Ram Charan)తో 'ఎవడు', మహేష్ బాబు(Mahesh Babu)తో 'మహర్షి'.. ఇలా టాలీవుడ్ టాప్ స్టార్స్ తో హిట్ సినిమాలు చేసి దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు వంశీ పైడిపల్లి. అయితే వేరే ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండటం వల్లనో లేక వేరే ఏవైనా కారణాల వల్లనో కానీ.. కొంతకాలంగా ఆయనకు తెలుగు స్టార్ హీరోలు అందుబాటులో లేకుండా పోయారు. 'మహర్షి' తర్వాత మహేష్ తో మరో సినిమా చేయాలని.. వెయిట్ చేసీ చేసీ.. కుదరకపోవడంతో కోలీవుడ్ స్టార్ విజయ్ తో 'వారసుడు' చేశాడు. ఆ సినిమా తర్వాత కూడా అదే పరిస్థితి. 'వారసుడు' వచ్చి ఏడాదిన్నర దాటిపోయినా.. ఇంతవరకు కొత్త ప్రాజెక్ట్ ని ప్రకటించలేదు పైడిపల్లి. టాలీవుడ్ టాప్ స్టార్స్ అంతా ఇతర ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. అందుకే వంశీ దృష్టి బాలీవుడ్ పై పడినట్లు సమాచారం.

దర్శకుడు వంశీ పైడిపల్లి తన తదుపరి సినిమాని బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ తో చేయనున్నారని వినికిడి. నిజానికి ఆయన షాహిద్ కపూర్, రణవీర్ సింగ్ వంటి హీరోలతో సినిమా చేసే అవకాశముందని ఆ మధ్య ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు అనూహ్యంగా ఆమిర్ ఖాన్ పేరు తెరపైకి వచ్చింది. ఇప్పటికే వంశీ వినిపించిన కథ నచ్చి, సినిమా చేయడానికి ఆమిర్ అంగీకరించాడని అంటున్నారు. పాన్ ఇండియా మూవీగా రూపొందనున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించనున్నాడట. దర్శకుడిగా వంశీ పైడిపల్లి ఆరు సినిమాలు తీస్తే.. అందులో ఐదు దిల్ రాజు బ్యానర్ లో చేసినవే. ఇప్పుడు ఆయన మరోసారి దిల్ రాజుతో చేతులు కలపడం విశేషం.