English | Telugu
అడ్రెస్ మారుస్తున్న బాలయ్య.. కారణమేంటి?
Updated : Nov 1, 2023
హైదరాబాద్ లోని బంజారాహిల్స్ రోడ్ నెం.12 లో ఉండే నటసింహం నందమూరి బాలకృష్ణ నివాసం ఎంతో ఫేమస్. ఎందరో అడ్రెస్ చెప్పడానికి బాలయ్య ఇంటిని ల్యాండ్ మార్క్ గా చెబుతుంటారు. బాలకృష్ణ కుటుంబం ఎన్నో ఏళ్ళుగా అక్కడే నివాసముంటుంది. అలాంటిది ఇప్పుడు బాలయ్య తన అడ్రెస్ ని మార్చుకోవడానికి రెడీ అవుతున్నట్లు న్యూస్ వినిపిస్తోంది.
ప్రస్తుతం బంజారాహిల్స్ లోని బాలయ్య ఇల్లు రోడ్డుని ఆనుకొని ఉంటుంది. ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఎక్కువ. నిత్యం వాహనాలు తిరుగుతూనే ఉంటాయి. అందుకే ఈ ట్రాఫిక్ శబ్దాలు లేని ప్రశాంతమైన చోటుకి మారాలని బాలయ్య నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ నిర్ణయం తీసుకోవడానికి వాస్తు కూడా ఒక కారణమనే ప్రచారం జరుగుతోంది.
బాలయ్య మారనున్న కొత్త ఇంటి అడ్రెస్ జూబ్లీహిల్స్ అని సమాచారం. ప్రస్తుతం ఇంటి నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయట. 2024 ఫిబ్రవరిలో గృహప్రవేశం చేయనున్నారని వినికిడి. మరో విశేషం ఏంటంటే.. బాలయ్య కొత్త ఇల్లు మెగాస్టార్ చిరంజీవి ఇంటికి సమీపంలోనే ఉంటుందట.