English | Telugu
అతిలోక సుందరి ద్విపాత్రాభినయంతో అదరగొట్టిన 9 సినిమాలు. ఆ చిత్రాలేంటో తెలుసా!?
Updated : Aug 12, 2023
వెండితెరపై తిరుగులేని తారగా రాణించిన వైనం.. అతిలోక సుందరి శ్రీదేవి సొంతం. ఇటు దక్షిణాదిలోనూ, అటు బాలీవుడ్ లోనూ తనదైన అభినయంతో మురిపించారీ ఆల్ ఇండియా సూపర్ స్టార్. బాలనటిగా కెరీర్ ని ఆరంభించి ఆనక అగ్ర కథానాయికగా శ్రీదేవి ఎదిగిన తీరు.. ఎందరో తరువాతి తరాల తారలకు మార్గదర్శకంగా నిలిచిందంటే అభినేత్రిగా ఆమె స్థాయి ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు గ్లామర్ వేషాలతో కట్టిపడేసిన శ్రీదేవి.. మరోవైపు అభినయానికి ఆస్కారమున్న భూమికల్లోనూ భలేగా మెప్పించారు.
ఇక డబుల్ రోల్స్ లో అయితే శ్రీదేవి అదరహో అనిపించారనే చెప్పాలి. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో కలుపుకుని తొమ్మిది చిత్రాల్లో ద్విపాత్రాభినయం చేశారు శ్రీదేవి. ఒక కథానాయిక ఇన్ని సార్లు డ్యూయెల్ రోల్స్ లో కనిపించడం అరుదనే చెప్పొచ్చు. అంతేకాదు, వీటిలో రెండు సినిమాలకి గానూ 'ఫిల్మ్ ఫేర్' అవార్డులు కూడా అందుకున్నారు ఈ టాలెంటెడ్ యాక్ట్రస్.
శ్రీదేవి డబుల్ రోల్స్ చేసిన చిత్రాల వివరాల్లోకి వెళితే..
అంగీకారం (1977): శ్రీదేవి నటించిన తొలి ద్విపాత్రాభినయ చిత్రం ఇది. మలయాళంలో రూపొందిన ఈ సినిమాలో సతి, విజిగా తల్లీకూతుళ్ళ పాత్రల్లో కనిపించారు అతిలోక సుందరి.
వణక్కతుక్కురియ కాదలియే (1978): రజినీకాంత్, విజయ్ కుమార్ హీరోలుగా నటించిన ఈ తమిళ చిత్రంలో అక్కాచెల్లెళ్ళుగా శాంతి, జెన్నీ వేషాల్లో మెప్పించారు శ్రీదేవి.
మోసగాడు (1980): శోభన్ బాబు టైటిల్ రోల్ లో నటించిన ఈ సినిమాలో చిరంజీవి ప్రతినాయకుడిగా కనిపించారు. కె. రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసిన ఈ మూవీలో సీత, గీత అనే అక్కాచెల్లెళ్ళుగా ఎంటర్టైన్ చేశారు శ్రీదేవి.
గురు (1989): మిథున్ చక్రవర్తి హీరోగా నటించిన ఈ బాలీవుడ్ సినిమాలో రమ, ఉమగా రెండు విభిన్న పాత్రల్లో ఆకట్టుకున్నారు ఆల్ ఇండియా సూపర్ స్టార్ శ్రీదేవి.
చాల్ బాజ్ (1989): శ్రీదేవికి ఉత్తరాదిన ఉత్తమ నటిగా తొలి 'ఫిల్మ్ ఫేర్' అవార్డుని అందించిన హిందీ చిత్రం 'చాల్ బాజ్'. సన్నీ డియోల్, రజినీకాంత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో కవలలైన అంజు, మంజుగా కనిపించారు అతిలోక సుందరి.
లమ్హే (1991): బాలీవుడ్ ఆల్ టైమ్ క్లాసిక్స్ లో ఒకటైన 'లమ్హే'లో పల్లవి, పూజగా తల్లీకూతుళ్ళ పాత్రల్లో అలరించారు శ్రీదేవి. అలాగే బెస్ట్ యాక్ట్రస్ గా మరో 'ఫిల్మ్ ఫేర్' అవార్డ్ ని తన ఖాతాలో జమ చేసుకున్నారు. ఇందులో అనిల్ కపూర్ కథానాయకుడిగా నటించారు.
బంజారన్ (1991): పునర్జన్మల నేపథ్యంలో సాగే ఈ హిందీ చిత్రంలో రేష్మ, దేవిగా రెండు వేర్వేరు కాలాలకు చెందిన పాత్రల్లో దర్శనమిచ్చారు శ్రీదేవి. ఈ సినిమాలో రిషి కపూర్ హీరోగా యాక్ట్ చేశారు.
ఖుదా గవా (1992): అమితాబ్ బచ్చన్, నాగార్జున కథానాయకులుగా నటించిన ఈ బాలీవుడ్ ప్రాజెక్ట్ లో బెనజిర్, మెహందీగా తల్లీకూతుళ్ళ పాత్రల్లో మెస్మరైజ్ చేశారు శ్రీదేవి.
గురుదేవ్ (1993): రిషి కపూర్, అనిల్ కపూర్ హీరోలుగా నటించిన ఈ హిందీ మూవీలో ప్రియ, సునీతగా ద్విపాత్రాభినయం చేసి మురిపించారు శ్రీదేవి.
(ఆగస్టు 13.. శ్రీదేవి జయంతి సందర్భంగా)