English | Telugu

ఎవరికీ తలొగ్గని భానుమతి.. ఓ సంగీత దర్శకుడికి పాదాభివందనం చేశారు.. ఎందుకో తెలుసా?

(డిసెంబర్ 24 భానుమతి వర్థంతి సందర్భంగా..)

పాతతరం నటీమణుల్లో బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు తెచ్చుకున్న భానుమతి గురించి అందరికీ తెలిసిందే. వివిధ శాఖల్లో విశేషమైన ఖ్యాతిని సంపాదించుకున్న ఆమె.. చిన్నతనంలో తండ్రి దగ్గర సంగీతాభ్యాసం చేశారు. ఆమె స్వరం చాలా విభిన్నంగా ఉంటుంది. సినిమా రంగంలో స్థిరపడిన తర్వాత ఎన్నో పాటలు పాటలు పాడారు. ఆమె పాటలకు ప్రత్యేకంగా అభిమానులు ఉండేవారు. అంతేకాదు, కొన్ని సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు.

తిరుగులేని ఆత్మవిశ్వాసం, తనకు నచ్చని ఏ విషయాన్నయినా ఖండించడం అనేది భానుమతికి చిన్నతనం నుంచీ అబ్బిన లక్షణం. అందుకే అనవసర విషయాల గురించి ఆమె దగ్గర ప్రస్తావించేవారు కాదు. ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌ వంటి స్టార్‌ హీరోలు కూడా ఆమెతో కలిసి నటించేందుకు భయపడేవారు. సినిమా రంగంలో ఇలాంటి లక్షణాలు ఉన్నవారు రాణించడం చాలా కష్టం. కానీ, భానుమతి మాత్రం దానికి అతీతంగా అద్భుతమైన విజయాలు సాధించి బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు తెచ్చుకున్నారు.

ఎన్టీఆర్‌, భానుమతి జంటగా నటించిన మల్లీశ్వరి ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి సంగీత దర్శకుడు ఎస్‌.రాజేశ్వరరావు. అప్పటి సంగీత దర్శకుల్లో రాజేశ్వరరావు ఓ విభిన్న వ్యక్తిత్వంతో ఉండేవారు. తను చేసే సంగీతం గురించి ఎవరైనా విమర్శించినా, సలహాలు ఇవ్వాలని చూసినా, తను చెప్పిన విధంగా గాయనీగాయకులు పాడకపోయినా ఆయనకు వెంటనే కోపం వచ్చేది. మారు మాట్లాడకుండా తన హార్మోనియం పెట్టెను తీసుకొని అక్కడి నుంచి బయటికి వచ్చేసేవారు. ఎంత పెద్ద హీరో, దర్శకనిర్మాతలైనా ఆయన ధోరణి అలాగే ఉండేది.

తనకు అసౌకర్యంగా ఉన్న వాతావరణంలో రాజేశ్వరరావు సంగీతం చేసేవారు కాదు. అలా సినిమా మధ్యలోనే వచ్చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. మాయాబజార్‌ వంటి సినిమాలో నాలుగు పాటలు కంపోజ్‌ చేసిన తర్వాత నిర్మాతల ధోరణి నచ్చక ఆ సినిమా నుంచి బయటికి వచ్చేశారు. 'శ్రీకరులు దేవతలు..', 'లాహిరి లాహిరి లాహిరిలో..', 'నీ కోసమే నే జీవించునది..', 'చూపులు కలిసిన శుభవేళ..' పాటలు ఎస్‌.రాజేశ్వరరావు కంపోజ్‌ చేసినవే. మిగతా పాటలు, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ను ఘంటసాలతో చేయించారు. టైటిల్స్‌లో తన పేరు వేయకపోయినా రాజేశ్వరరావు బాధపడలేదు.

ఎన్టీఆర్‌ దర్శత్వంలో వచ్చిన దానవీరశూర కర్ణ చిత్రానికి మొదట అనుకున్న సంగీత దర్శకుడు ఎస్‌.రాజేశ్వరరావు. అందులో ఒక పాట చేసిన తర్వాత ఎన్టీఆర్‌ సోదరుడు త్రివిక్రమరావు పాటలు ఎలా ఉండాలి అనే విషయంలో రాజేశ్వరరావుకు సలహా ఇవ్వాలని చూశారు. ఆ క్షణమే ఎన్టీఆర్‌ దగ్గరకు వెళ్లి 'మీ తమ్ముడికి సంగీత జ్ఞానం బాగా ఉంది. అతనితోనే మ్యూజిక్‌ చేయించుకోండి' అని చెప్పి అక్కడి నుంచి వచ్చేశారు. ఆ సినిమాలో ఎంతో పెద్ద హిట్‌ సాంగ్‌ అయిన 'ఏ తల్లి నిను కన్నదో..' పాట రాజేశ్వరరావు కంపోజ్‌ చేసిందే. ఆ తర్వాత పెండ్యాల నాగేశ్వరరావుతో మిగతా పాటలు చేయించుకున్నారు ఎన్టీఆర్‌.

ఇక 'మల్లీశ్వరి' సినిమాకి సంబంధించి మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ జరుగుతున్నప్పుడు 'మనసున మల్లెల మాలలూగెనే..' పాటను ఎలా పాడాలో భానుమతికి చెబుతున్నారు రాజేశ్వరరావు. కానీ, కొన్ని సంగతులు ఆయన చెప్పినట్టు కాకుండా తనదైన ధోరణిలో పాడుతున్నారు భానుమతి. తను చెప్పినట్టుగా పాడితేనే పాట బాగా వస్తుందని, తేకపోతే పాట చెడిపోతుందని ఆయన చెప్పారు. కానీ, భానుమతి మాత్రం తను అనుకున్న విధంగానే పాడారు. పైగా తనకు కూడా సంగీత జ్ఞానం ఉంది అంటూ గుర్తు చేశారు. ఆమె అలా అనడంతో వెంటనే అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న దర్శకుడు బి.ఎన్‌.రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన్ని బ్రతిమాలి తీసుకొచ్చారు. చివరికి రాజేశ్వరరావు ఎలా పాడమన్నారో అలాగే పాడారు భానుమతి.

రికార్డింగ్‌ పూర్తయిన తర్వాత యూనిట్‌ సభ్యులతో కూర్చొని ఆ పాటను విన్నారు భానుమతి. ఆ పాటను రాజేశ్వరరావుగారు అలా ఎందుకు పాడమన్నారో ఆమెకు అప్పుడు అర్థమైంది. క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా ఆయన దగ్గరకు వెళ్లి పాదాభివందనం చెయ్యబోయారు. కానీ, రాజేశ్వరరావు వారించారు. 'మీరు పాటను అలా ఎందుకు పాడమన్నారో నాకు ఇప్పుడు అర్థమైంది. నేను తప్పుగా మాట్లాడాను. నన్ను క్షమించండి' అని రాజేశ్వరరావుకు నమస్కారం చేశారు భానుమతి.