English | Telugu
"సన్నజాజులోయ్.. కన్నెమోజులోయ్.." - ఎన్టీఆర్ 'సింహబలుడు'కి 45 ఏళ్ళు
Updated : Aug 10, 2023
నటరత్న నందమూరి తారక రామారావుకి అచ్చొచ్చిన దర్శకుల్లో దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు ఒకరు. ఈ ఇద్దరి కలయికలో వచ్చిన సినిమాల్లో సింహభాగం బాక్సాఫీస్ ముంగిట వసూళ్ళ వర్షం కురిపించాయి. 'అడవి రాముడు' వంటి ఇండస్ట్రీ హిట్ తో మొదలైన ఈ కాంబో.. 'మేజర్ చంద్రకాంత్' వంటి బ్లాక్ బస్టర్ మూవీ వరకు సాగింది. ఇక ఈ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్ని కూడా మ్యూజికల్ గా మెప్పించాయి. అలా అలరించిన చిత్రాల్లో 'సింహబలుడు' ఒకటి.
'అడవి రాముడు' వంటి సెన్సేషనల్ మూవీ తరువాత ఎన్టీఆర్, కె. రాఘవేంద్రరావు కలయికలో వచ్చిన ఈ సినిమా.. కమర్షియల్ గా ఆశించిన విజయం సాధించలేదు. అయితే, పాటల పరంగా మాత్రం భలేగా మురిపించింది. మరీముఖ్యంగా.. ఇందులోని "సన్నజాజులోయ్ కన్నెమోజులోయ్" గీతం ఇప్పటికీ ఎక్కడోచోట వినిపిస్తూనే ఉంటుంది. ఈ పాటలో అందాల నర్తకి జయమాలిని తన చిందులతో కనువిందు చేసింది. ఈ గీతంతో పాటు "చూపులతో ఉడకేసి", "ఓ చెలి చలి", "ఏందమ్మో చురుక్కుమంది", "ఈ గంట గణ గణ" కూడా ఆకట్టుకున్నాయి.
జానపద కథాంశంతో తెరకెక్కిన 'సింహబలుడు'లో ఎన్టీఆర్ సరసన వాణిశ్రీ నటించగా.. రావుగోపాల రావు, సత్యనారాయణ, మోహన్ బాబు, త్యాగరాజు, మాడా, సారథి, పీజే శర్మ, అంజలీ దేవి, రమాప్రభ, పల్లవి, హలం ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. డి.వి. నరసరాజు కథను అందించిన ఈ చిత్రానికి యం.యస్. విశ్వనాథన్ స్వరాలు సమకూర్చగా.. వేటూరి సుందరరామ్మూర్తి పదరచన చేశారు. తిరుపతి ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీరంగరాజు నిర్మించిన 'సింహబలుడు'.. 1978 ఆగస్టు 11న రిలీజైంది. శుక్రవారంతో ఈ చిత్రం 45 వసంతాలు పూర్తిచేసుకుంటోంది.