English | Telugu
హీరోలతో సమానంగా పారితోషికం అందుకున్న ఏకైక విలన్ రాజనాల!
Updated : Jan 2, 2026
(జనవరి 3 రాజనాల శత జయంతి సందర్భంగా..)
ఒక సినిమాకి కథానాయకుడు ఎంత ప్రధానమో.. ప్రతినాయకుడు కూడా అంతే ప్రధానం. బలవంతుడైన విలన్‌ని ఎదిరించి పోరాడినపుడే హీరో క్యారెక్టర్ బాగా ఎలివేట్ అవుతుంది. అలాంటి ఓ పవర్‌ఫుల్ విలన్ రాజనాల. 1950వ దశకంలోని విలన్లకు పూర్తి భిన్నంగా కనిపిస్తూ ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసిన అరుదైన నటన రాజనాల సొంతం. ఒక విధంగా ప్రతినాయకుడి పాత్రకు వన్నె తెచ్చారు రాజనాల.ఇటీవలి కాలంలో చాలా మంది పాతతరం నటుల శతజయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. అందులో భాగంగానే ఈ ఏడాది తెలుగు సినిమా చరిత్రలో మేటి విలన్‌గా పేరు తెచ్చుకున్న రాజనాల శతజయంతి వచ్చింది
1925 జనవరి 3న నెల్లూరు జిల్లా కావలిలో జన్మించారు రాజనాల. ఆయన పూర్తి పేరు రాజనాల కాళేశ్వరరావునాయుడు. ఇంటర్ పూర్తయిన తర్వాత డిగ్రీ చెయ్యాలని అనుకోలేదు. ఎంత చదివినా చివరికి ఉద్యోగమే కదా చేసేది అనే ఆలోచనతో ఇంటర్‌తోనే చదువును ఆపేశారు. ఆ తర్వాత రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో చేరారు. ఆ తర్వాత పబ్లిక్ సర్వీస్ పరీక్షలు రాసి రెవెన్యూ ఇన్‌సెక్టర్‌గా ప్రమోషన్ పొందారు. 1944 నుంచి 1951 వరకు ఆ డిపార్ట్‌మెంట్‌లోనే వర్క్ చేశారు. అయితే లక్నో యూనివర్సిటీ నుంచి ఫిలాసఫీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పట్టా పొందారు. సినిమాల్లోకి రాకముందే ఇంగ్లీష్‌లో మంచి పట్టు సాధించారు. ఇంగ్లీష్‌తోపాటు పలు భాషలు ఆయన మాట్లాడేవారు. ఆయన ఇంటిలోని లైబ్రరీలో లక్షల విలువ చేసే పుస్తకాలు ఉండేవి.
1948లో స్నేహితుడు లక్ష్మీకుమార్‌రెడ్డితో కలిసి ఒక నాటక సమాజాన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా నాటకాలు వేశారు రాజనాల. తొలి ప్రయత్నంగా ఆత్రేయ రచించిన ఎవరు దొంగ అనే నాటకాన్ని ప్రదర్శించారు. ఇది ప్రభుత్వ ఉద్యోగులకు వ్యతిరేకంగా ఉండే నాటకం కావడంతో జిల్లా కలెక్టర్ ఆగ్రహానికి గురయ్యారు రాజనాల. ఆ తర్వాత అదే తరహాలో ప్రగతి అనే నాటకం వేశారు. అది కూడా ప్రభుత్వ ఉద్యోగులకు వ్యతిరేకంగా ఉండడంతో జిల్లా కలెక్టర్ రాజనాలను మూడు నెలలు సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ పూర్తయిన తర్వాత ఉద్యోగంలో చేరినప్పటికీ సవ్యంగా పనిచేయలేకపోయారు.
అప్పటికే మిత్రుడు లక్ష్మీకుమార్‌రెడ్డి సినిమా ప్రయత్నాల కోసం మద్రాస్ వెళ్లి నిర్మాత హెచ్.ఎం.రెడ్డి దగ్గర పనిచేస్తున్నారు. 1951లో ఆయన నిర్మిస్తున్న ‘ప్రతిజ్ఞ’ చిత్రంలో విలన్‌గా అవకాశం ఇప్పించారు లక్ష్మీకుమార్‌రెడ్డి. అదే రాజనాల మొదటి సినిమా. ఈ సినిమాలో ఆయన విలన్‌గా నటించారు. వాస్తవానికి రాజనాలకు విలన్‌గా నటించడం ఇష్టం లేదు. 1953లో విడుదలైన ‘ప్రతిజ్ఞ’ అంతగా ఆడకపోయినా నటుడిగా ఆయనకు మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘వద్దంటే డబ్బు’ చిత్రంలో ఆయనకు మామగారిగా వృద్ధ పాత్రలో నటించారు రాజనాల. ఆ సమయంలోనే ఎన్టీఆర్‌తో రాజనాలకు సాన్నిహిత్యం పెరిగింది. ఆ సినిమా తర్వాత నుంచి రాజనాలను మామాజీ అని పిలిచేవారు ఎన్టీఆర్.
చాలా తక్కువ సమయంలోనే విలన్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు రాజనాల. అప్పట్లో ఎన్టీఆర్, కాంతారావు ఎక్కువగా జానపద సినిమాలు చేసేవారు. ఎవరు హీరో అయినా విలన్‌గా రాజనాల నటించేవారు. హీరోలతో సమానంగా పారితోషికం అందుకున్న ఏకైక విలన్ రాజనాల. దాదాపు 15 సంవత్సరాలు విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్‌గా 400కి పైగా సినిమాలు చేశారు. 1966లో వచ్చిన హాలీవుడ్ సినిమా ‘మాయా ది మాగ్నిఫిషెంట్’ చిత్రంలో ఇండియన్ అఫీషియల్‌గా నటించారు.
1950, 1950 దశకాల్లో విలన్ అంటే రాజనాల అనే పేరు తెచ్చుకున్నారు. విలన్‌లో ఉండే క్రూరత్వం రాజనాలలో కనిపించేది. వివిధ లొకేషన్లలో షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన దగ్గరకు వెళ్లేందుకు జనం భయపడేవారు. ముఖ్యంగా మహిళలు ఆయన దగ్గరకు వెళ్లేవారు కాదు. సినిమాల్లో విలన్‌గా ఆయన నటన, ముఖ్యంగా ఆయన నవ్వు ఎంతో పాపులర్ అయింది. తన కెరీర్‌లో 100కి పైగా సినిమాల్లో విలన్‌గా నటించారు రాజనాల. ఎన్టీఆర్, ఎం.జి.ఆర్, జయలలిత.. ఇలా ముగ్గురు ముఖ్యమంత్రులతో కలిసి నటించిన ఘనత దక్కించుకున్నారు.
వ్యక్తిగత విషయాలకు వస్తే.. మొదట శోభను వివాహం చేసుకున్నారు రాజనాల. కొన్ని సంవత్సరాల తర్వాత ఆమె అకాల మరణం చెందడంతో భూదేవిని పెళ్లి చేసుకున్నారు. రాజనాలకు నలుగురు సంతానం. 1970వ దశకం వచ్చే సరికి పరిశ్రమకు కొత్త విలన్స్ రావడం ప్రారంభమైంది. దాంతో ఆయనకు అవకాశాలు బాగా తగ్గాయి. సినిమాల ద్వారా ఎంతో సంపాదించినప్పటికీ దానధర్మాలు ఎక్కువ చేయడం, సినిమాలు తగ్గడంతో ఆస్తంతా కరిగిపోయింది. అయినప్పటికీ ఎన్టీఆర్ తన సినిమాల్లో అవకాశాలు ఇచ్చి ఆదుకున్నారు. చివరి రోజుల్లో ఇ.వి.వి.సత్యనారాయణ హలోబ్రదర్ చిత్రంలో, ఎస్.వి.కృష్ణారెడ్డి నెంబర్‌వన్ సినిమాలో అవకాశాలు ఇచ్చారు. ఆయన పరిస్థితి తెలుసుకున్న కృష్ణ తను హీరోగా నటిస్తున్న తెలుగువీర లేవరా చిత్రంలో మంచి పాత్ర ఇచ్చారు. అరకులో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆయన ఆరోగ్యం క్షీణించడంతో హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేర్చారు. ఆయనకు మధుమేహం పెరగడం, దాని వల్ల ఇన్‌ఫెక్షన్ ఎక్కువ కావడంతో కుడికాలును తొలగించారు డాక్టర్లు. దాంతో సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు. 1998లో రాజనాలకు గుండెపోటు రావడంతో చెన్నయ్‌లోని విజయ ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ 1998 మే 21న 73 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు రాజనాల.