English | Telugu

ఎవరితోనూ పోల్చలేని విశిష్ట నటుడు కళావాచస్పతి కొంగర జగ్గయ్య!

(డిసెంబర్‌ 31 కొంగర జగ్గయ్య జయంతి సందర్భంగా..)

కళావాచస్పతి జగ్గయ్య.. ఈ పేరుకి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. తన కంచుకంఠంతో చెప్పే డైలాగులు, ఆయన అభినయం తెలుగు ప్రేక్షకులు మర్చిపోలేరు. ఆయన పోషించిన పాత్రలు వారి మనసుల్లో ఎప్పటికీ చెక్కు చెదరకుండా ఉంటాయి. పాత్ర ఏదైనా, దాని స్వభావం ఎలా ఉన్నా.. తన నటనతో ఆ పాత్రకు జీవం పోసే అసమాన నటుడు జగ్గయ్య. ఆయన నటుడే కాదు, రచయిత, చిత్రకారుడు, పాత్రికేయుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు, ఆకాశవాణిలో తొలితరం తెలుగు వార్తల చదువరి. ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు తెచ్చుకున్న జగ్గయ్యను 1992లో ప్రతిష్ఠాత్మక పద్మభూషణ్‌ పురస్కారంతో సత్కరించింది కేంద్ర ప్రభుత్వం.

1926 డిసెంబర్‌ 31న గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని మోరంపూడి అనే గ్రామంలో సీతారామయ్య, రాజ్యలక్ష్మమ్మ దంపతులకు జన్మించారు కొంగర జగ్గయ్య. 11 సంవత్సరాల వయసులోనే సీత అనే నాటకంలో లవుడి పాత్రను పోషించారు. విద్యార్థి దశలోనే కాంగ్రెస్‌ పార్టీలో చేరి భారత స్వాతంత్య్ర పోరాటంలో చురుకుగా పాల్గొన్నారు. ఆరోజుల్లోనే తెనాలిలోని కాంగ్రెస్‌ సోషలిస్ట్‌ గ్రూపుకు సెక్రటరీగా పనిచేసారు. వివిధ ప్రాంతాల్లో జరిగే సదస్సులకు హాజరై పార్టీ చేసే తీర్మానాలను తెలుగులోకి అనువదించి, వాటిని సైక్లో స్టైల్‌ తీయించి ఆంధ్రప్రదేశ్‌లో పంచిపెట్టేవారు. ఇంటర్మీడియట్‌ తర్వాత కొంత కాలం దేశాభిమాని అనే పత్రికలో ఉప సంపాదకుడిగానూ, ఆ తర్వాత ఆంధ్రా రిపబ్లిక్‌ అనే ఆంగ్ల వారపత్రికకు సంపాదకుడిగానూ పనిచేశారు.

గుంటూరులోని ఎసి కాలేజీలో చదువుతున్న సమయంలో ఎన్‌.టి.రామారావుతో జగ్గయ్యకు పరిచయం ఏర్పడిరది. వీళ్ళిద్దరూ కలిసి ఎన్నో నాటకాలు ప్రదర్శించేవారు. జగ్గయ్య మూడు సంవత్సరాలపాటు వరుసగా ఉత్తమ నటుడు పురస్కారం పొందారు. డిగ్రీ పూర్తవగానే దుగ్గిరాలలో ఉపాధ్యాయుడిగా ఉద్యోగమొచ్చింది. అప్పుడు కూడా ఖాళీ సమయాల్లో నాటకాలు వేసేవారు. ఆ తర్వాత ఢల్లీిలో ఆల్‌ ఇండియా రేడియోలో మూడు సంవత్సరాలపాటు వార్తలు చదివే ఉద్యోగం చేసారు.

నాటకాలు వేసే ప్రతి నటుడూ సినిమా రంగానికి వెళ్లాలని ఆశ పడుతుంటారు. అలా జగ్గయ్య కూడా 1952లో త్రిపురనేని గోపీచంద్‌ దర్శకత్వంలో వచ్చిన ‘ప్రియురాలు’ అనే సినిమాతో సినీరంగ ప్రవేశం చేశారు. అయితే ఈ సినిమా విజయం సాధించలేదు. ఆ తర్వాత రెండు సంవత్సరాల్లో చేసిన కొన్ని సినిమాలు కూడా ఆడలేదు. సినిమాల కోసం ఆలిండియా రేడియోలో సంవత్సరం పాటు సెలవు పెట్టారు జగ్గయ్య. సినిమాల్లోనే కొనసాగాలని నిర్ణయించుకున్న తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేశారు. 1954లో వచ్చిన బంగారుపాప చిత్రం విజయం సాధించింది. అందులో పాతికేళ్ళ వయసులోనే వృద్ధుడిగా జగ్గయ్య పోషించిన పాత్రకు మంచి పేరు వచ్చింది.

ఆ తర్వాత అర్థాంగి చిత్రంలో విలన్‌గానూ మెప్పించారు. ఈ రెండు సినిమాలు జగ్గయ్య ఒక వైవిధ్యమైన నటుడిగా స్థిరపడేలా చేశాయి. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో హీరోగా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, కమెడియన్‌గా, విలన్‌గా.. ఇలా అన్ని తరహా పాత్రలు పోషించి ఏ నటుడితోనూ పోల్చలేని ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు జగ్గయ్య. ఆ తర్వాత అల్లూరి సీతారామరాజు చిత్రంలో చేసిన రూథర్‌ఫర్డ్‌ పాత్ర ఆయన నట జీవితంలో ఒక మైల్‌స్టోన్‌ అని చెప్పొచ్చు. రూథర్‌ఫర్డ్‌ 1940 ప్రాంతంలో కృష్ణాజిల్లా, గుంటూరు, కడప తదితర ప్రాంతాల్లో ప్రభుత్వ సర్వీసులో ఉన్నారు. ఆయన గురించి ఎంతో మంది అధికారులకు తెలుసు. రూథర్‌ ఫర్డ్‌ ప్రవర్తన గురించి, మనస్తత్వం గురించి వారిని అడిగి తెలుసుకున్నారు జగ్గయ్య. అతను చాలా మంచి వ్యక్తి అని, సీతారామరాజు అంటే అతనికి ఎంతో గౌరవం ఉండేదని తెలిసింది. అయితే బ్రిటిష్‌ ప్రభుత్వానికి విధేయుడు కాబట్టి సీతారామరాజును పట్టుకుని తీరాలి. ఈ విషయాలు తెలుసుకున్న తర్వాత రూథర్‌ఫర్డ్‌ పాత్రను రొటీన్‌గా వుండే విలన్‌లా కాకుండా నిర్వహణకు బద్దుడుగా ఉండే హుందా కలిగిన వ్యక్తిలా మార్చి రాయమని రచయిత మహారథిని కోరారు జగ్గయ్య. అలా రూథర్‌ఫర్డ్‌ క్యారెక్టరైజేషన్‌ను మార్చిన తర్వాత ఆ క్యారెక్టర్‌కు మంచి ఎలివేషన్‌ వచ్చింది. దాన్ని ఎంతో అద్భుతంగా పోషించిన జగ్గయ్యకు ప్రశంసలు లభించాయి. మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు అల్లూరి సీతారామరాజు సినిమా చూసి జగ్గయ్యకు ఫోన్‌ చేసి ‘మీ పాత్ర పోషణ అద్భుతం’ అన్నారట.

1952 నుంచి 1970 నటుడిగా ఎంతో బిజీగా ఉండేవారు జగ్గయ్య. రొటీన్‌ క్యారెక్టర్లు చెయ్యడానికి జగ్గయ్య విరుద్ధం. అందుకే ఒక పాత్ర కోసం తన దగ్గరకు వచ్చిన నిర్మాతలను అందులోని క్లిష్టమైన పాత్ర ఇవ్వమని కోరేవారు. విలన్‌ అంటే భయంకరంగా ఉండాల్సిన అవసరం లేదు. అందంగా ఉంటూ మనమధ్యన తిరిగే మామూలు మనిషిలాగే ఉంటాడు. అలా ఉంటేనే ఎదుటివారిని తేలికగా మోసం చేయగలడని నిరూపించడానికి అలాంటి విలన్‌ క్యారెక్టర్లు అనేకం చేశారు జగ్గయ్య.

నటుడిగానే కాదు, డబ్బింగ్‌ ఆర్టిస్టుగా కూడా ఎవరికీ రాని గుర్తింపు జగ్గయ్యకు వచ్చింది. ముఖ్యంగా తమిళ హీరో శివాజీ గణేశన్‌ సినిమాలను తెలుగులోకి డబ్‌ చేసినపుడు శివాజీకి జగ్గయ్యతోనే డబ్బింగ్‌ చెప్పించేవారు. శివాజీయే మాట్లాడారా అన్నంత సహజంగా ఆయన డబ్బింగ్‌ చెప్పేవారు. ఒకవైపు నటుడిగా కొనసాగుతూనే మరోవైపు సాహిత్య సేవ చేసేవారు. ప్రజలను చైతన్యవంతులను చేసే కవితలు రాస్తుండేవారు. రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ రచించిన ‘గీతాంజలి’ని తెలుగులో ‘రవీంద్ర గీత’ పేరుతో అనువదించారు జగ్గయ్య. అలాగే రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. 1967లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో ఒంగోలు నియోజకవర్గం ఎం.పి.గా కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. భారతీయ చలనచిత్ర చరిత్రలో లోక్‌సభకు ఎన్నికైన తొలి నటుడుగా కొంగర జగ్గయ్య చరిత్ర సృష్టించారు.

నటుడిగానే కాదు, నిర్మాతగా కూడా తన అభిరుచి మేరకు 1962లో ‘పదండి ముందుకు’ పేరుతో ఒక చైతన్యవంతమైన సినిమాను నిర్మించారు జగ్గయ్య. 1930లో మహాత్మాగాంధీ నాయకత్వంలో జరిగిన సహాయ నిరాకరణోద్యమం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ఎలాంటి కమర్షియల్‌ అంశాలు లేకుండా వి.మధుసూదనరావు ఈ చిత్రాన్ని రూపొందించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ పొందిన తొలి సినిమా ఇదే. ఈ సినిమాను పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శించారు. ఈ చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వం 50,000 రూపాయల పురస్కారాన్ని అందించింది.

1952 నుంచి 1994 వరకు 500కి పైగా సినిమాల్లో అన్ని తరహా పాత్రలు పోషించారు జగ్గయ్య. అయితే అన్నీ తెలుగు సినిమాలే కావడం విశేషం. వాటిలో ఒకే ఒక్క తమిళ సినిమా శివగామి ఉంది. ఆయన నటించిన చివరి సినిమా 1994లో నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన బొబ్బిలి సింహం. దీని తర్వాత మరో సినిమా చేయలేదు జగ్గయ్య. ఆ తర్వాత ఆయనకు తొంటి ఆపరేషన్‌ జరిగింది. దానివల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో 2004 మార్చి 5న చెన్నయ్‌లో తుదిశ్వాస విడిచారు కళావాచస్పతి కొంగర జగ్గయ్య.