English | Telugu
పాతికేళ్ళ 'శ్రీరాములయ్య'.. ప్రారంభోత్సవంలో 'కారుబాంబు' దాడి!
Updated : Aug 14, 2023
వెండితెరపైకి వచ్చాక సంచలనం సృష్టించే సినిమాలు చాలానే ఉన్నాయి. కానీ, ప్రారంభోత్సవం నుంచే వార్తల్లో నిలిచిన చిత్రాలు మాత్రం చాలా అరుదుగా ఉంటాయి. అలాంటి సినిమాల్లో.. 'శ్రీరాములయ్య' ఒకటి. పరిటాల శ్రీరాములు జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు టైటిల్ రోల్ లో నటించగా.. తనకి జంటగా అభినేత్రి సౌందర్య కనిపించారు. కామ్రేడ్ సత్యంగా నందమూరి హరికృష్ణ ఓ ప్రత్యేక పాత్రలో దర్శనమివ్వగా.. శ్రీహరి కీలక పాత్రలో అలరించారు. 'ఎన్ కౌంటర్' ఫేమ్ ఎన్. శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని పరిటాల సునీత నిర్మించారు.
1997 నవంబర్ 19న ప్రారంభమైన 'శ్రీరాములయ్య'కి సంబంధించిన 'కారుబాంబు' దాడి అప్పట్లో సంచలనం సృష్టించింది. జూబ్లీహిల్స్ రామానాయుడు స్టూడియో సమీపంలో చోటుచేసుకున్న ఈ వ్యూహాత్మక దుర్ఘటనలో పలువురు సినీ జర్నలిస్ట్ లు, చిత్ర సాంకేతిక నిపుణులు మృతి చెందడం అప్పట్లో రాజకీయ రంగంలోనూ, ముఠాకక్షల్లోనూ, చిత్ర పరిశ్రమలోనూ ప్రకంపనలు రేపింది. అప్పటి పెనుగొండ నియోజకవర్గం శాసనసభ్యుడు, పరిటాల శ్రీరాములు తనయుడు పరిటాల రవీంద్రని చంపడానికి 'సూరి' అలియాస్ గంగుల సూర్యనారాయణరెడ్డి వేసిన ఈ కారు బాంబు ప్లాన్.. దాదాపు 25 మంది ప్రాణాలు బలితీసుకుంది. పరిటాల రవి సహ పలువురు గాయాల పాలయ్యారు. వేలాదిమంది పరిటాల రవీంద్ర అభిమానులు హాజరైన ఈ ప్రారంభోత్సవ వేడుకలో ఇలాంటి దుర్ఘటన చోటుచేసుకోవడం అప్పట్లో కలకలం రేపింది.
ప్రారంభోత్సవం అనంతరం దుర్ఘటన చోటుచేసుకున్నా.. పలువురు మోహన్ బాబు, శంకర్ ని సినిమా చేయొద్దంటూ బెదిరించినా.. చిత్ర నిర్మాణాన్ని మాత్రం ఆపలేదు పరిటాల రవీంద్ర. కథానాయకుడు, దర్శకుడు సహకారంతో సకాలంలోనే పూర్తి చేశారు. 'దాన వీర శూర కర్ణ' (1977) తరువాత నటనకు విరామం తీసుకున్న హరికృష్ణ.. 21 ఏళ్ళ అనంతరం తెరపై కనిపించిన సినిమా 'శ్రీరాములయ్య' కావడం విశేషం. అది కూడా పరిటాల రవీంద్ర కోరిక మేరకే ఆయన రీఎంట్రీ ఇచ్చారని సమాచారం.
ప్రారంభోత్సవ సమయంలో, నిర్మాణ తరుణంలో పలు సమస్యలు, దుర్ఘటనలు ఎదురైనా.. సిల్వర్ స్క్రీన్ పై మాత్రం జననీరాజనాలు అందుకుంది 'శ్రీరాములయ్య' సినిమా. మోహన్ బాబు, హరికృష్ణ, సౌందర్య, శ్రీహరి తదితరుల అభినయంతో పాటు శంకర్ దర్శకత్వ ప్రతిభ, వందేమాతరం శ్రీనివాస్ సంగీతం 'శ్రీరాములయ్య' విజయంలో ముఖ్య భూమిక పోషించాయి. ఇందులోని "భూమికి పచ్చాని రంగేసినట్టు", "నను గన్న నా తల్లి", "కర్మభూమిలో పూసిన ఓ పువ్వా" గీతాలు విశేషాదరణ పొందగా.. "విప్ప పూల", "పోరాటాల రాములు", "జోహారు జోహారు", "రాజ్యహింస", "ఘడియ ఘడియ" పాటలు కూడా ఆకట్టుకున్నాయి. ఉత్తమ గాయకుడు (వందేమాతరం శ్రీనివాస్), స్పెషల్ జ్యూరీ (శ్రీహరి) విభాగాల్లో 'శ్రీరాములయ్య' నంది పురస్కారాలు అందుకుంది. 1998 ఆగస్టు 14న జనం ముందు నిలిచిన 'శ్రీరాములయ్య'.. నేటితో 25 వసంతాలు పూర్తిచేసుకుంది.