English | Telugu
'వకీల్ సాబ్'లో "సత్యమేవ జయతే" సాంగ్ ఎలా ఉందంటే...
Updated : Mar 3, 2021
పవన్ కల్యాణ్ టైటిల్ రోల్ చేస్తున్న 'వకీల్ సాబ్' మూవీ ఏప్రిల్ 9న విడుదలకు రెడీ అవుతోంది. లైంగిక హింసను ఎదుర్కొన్న ముగ్గురు అమ్మాయిల తరపున వాదించి వారిని కాపాడే ఓ లాయర్ కథతో హిందీలో వచ్చి విజయం సాధించిన 'పింక్' మూవీకి ఇది రీమేక్. ఈ సినిమాలోని "సత్యమేవ జయతే" అనే పాటను ఈరోజు విడుదల చేశారు. తమన్ స్వరాలు కూర్చగా, రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను శంకర్ మహదేవన్, పృథ్వీచంద్ర, తమన్ కలసి ఆలపించారు.
సినిమాలో పవన్ కల్యాణ్ క్యారెక్టరైజేషన్ ఏమిటనే విషయాన్ని ఈ పాట ద్వారా తెలియజేశారు. 'వకీల్ సాబ్' కేవలం కేసులు వాదించే వకీలు మాత్రమే కాదనీ జనంతో కలగలసిన జనం మనిషని చెప్తూ, "జనజనజన జనగణమున కలగలసిన జనం మనిషిరా.. మనమనమన మనతరపున నిలబడగల నిజం మనిషిరా" అంటూ పాటను ప్రారంభించారు. చీకటి ముసురుకొని ఉండే పేదవాళ్ల కలలను ఆయన తన వెలుగుతో గెలిపిస్తాడు. నలిగిపోయిన బతుకులకు ఆసరాగా నిలుస్తాడు. అందుకే, "నిశి ముసిరిన కలలను తన వెలుగుతొ గెలిపించు ఘనుడురా.. పడి నలిగిన బతుకులకొక బలమగు భుజమివ్వగలడురా" అని పల్లవిని ముగించారు.
వకీల్ సాబ్ ఎట్లాంటి వాడంటే.. తన ముందు తప్పు జరిగితే, ఆ తప్పు చేసిన వాళ్లను అస్సలు వదలడు. అన్యాయానికి గురైన వాళ్లకు వెన్నుదన్నుగా నిలుస్తాడు. ఆ విషయాన్ని, "వదలనే వదలడు ఎదురుగ తప్పు జరిగితే.. ఇతనిలా ఓ గళం మన వెన్నుదన్నై పోరాడితే.. సత్యమేవ జయతే" అని చెప్పారు.
ఎంత గుండెధైర్యం కలిగినవాడో, అంతటి దయార్ద్ర హృదయుడు ఈ వకీల్ సాబ్. అంతేనా.. బాధల్లో ఉన్నవాళ్లకు న్యాయం జరగాలని గొంతెత్తే పోరాటధీరుడు. ఆ సంగతిని, "గుండెతో స్పందిస్తాడు అండగా చెయ్యందిస్తాడు.. ఇల చెంపజారెడి ఆఖరి అశ్రువు నాపెడివరకూ.. అనునిత్యం బలహీనులందరి ఉమ్మడి గొంతుగ పోరాటమె తన కర్తవ్యం" అనే లైన్ల ద్వారా తెలిపారు.
ఇక్కడి దాకా శంకర్ మహదేవన్ గళంలో గంభీరంగా వకీల్ సాబ్ గుణగణాల్నీ, ఆయన ధీరోదాత్తతనూ తెలియజేసిన పాట పృథ్వీచంద్ర గొంతులో ర్యాప్‌లోకి టర్న్ తీసుకుంది. "వకాల్తాపుచ్చుకుని వాదించే ఈ వకీలు.. పేదోళ్ల పక్కనుండి కట్టిస్తాడు బాకీలు.. బెత్తంలా చుర్రుమని కక్కిస్తాడు నిజాలు.. మొత్తంగ న్యాయానికి పెట్టిస్తాడు దండాలు" అంటూ ఆయన ఎట్లాంటి లాయరో చెప్పారు. ఇలాంటివాడు ఒక్కడుంటే బాధితులకు నిశ్చింతగా ఉంటుందనీ, ఎలాంటి అన్యాయాలు తలెత్తవనీ తెలియజేస్తూ, "ఇట్టాంటి ఒక్కడుంటే అంతే చాలంతే.. గొంతెత్తి ప్రశ్నించాడో అంతా నిశ్చింతే.. ఇట్టాంటి అన్యాయాలు తలెత్తవంతే.. మోరెత్తే మోసగాళ్ల పత్తా గల్లంతే.. సత్యమేవ జయతే" అని పాటను ముగించారు.
చివరి చరణాన్ని ర్యాప్‌లో చేయకుండా మొదటి చరణం తరహాలోనే కొనసాగించినట్లయితే పాటకు మరింత డెప్త్ వచ్చి ఉండేదనిపించింది. యూత్‌ను దృష్టిలో పెట్టుకొని పాటను ఇలా ట్యూన్ చేసి ఉంటారనుకోవాలంతే. ఏదేమైనా ఒరిజినల్‌లో మనం చూడని తరహా వకీల్ సాబ్‌ను మనం ఈ సినిమాలో చూడబోతున్నాం. అమితాబ్ బచ్చన్ చేయని ఫైట్లను ఈ సినిమాలో పవన్ కల్యాణ్ చేయడాన్ని చూడబోతున్నాం. ఎనర్జిటిక్, యాక్టివ్, మోర్ కరేజియస్ 'వకీల్ సాబ్'ను ఏప్రిల్ 9న మనం దర్శించబోతున్నాం.
శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేసిన ఈ మూవీని బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. పవన్ కల్యాణ్ జోడీగా శ్రుతి హాసన్ కనిపించే ఈ సినిమాలో నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల లైంగిక వేధింపులకు గురయ్యే అమ్మాయిలుగా నటించారు.