English | Telugu

ఇట‌లీ నుంచి స్పోర్ట్స్‌ కారు తెప్పిస్తున్న‌ జూనియ‌ర్ ఎన్టీఆర్‌!

 

టాలీవుడ్ స్టార్ల‌లో చాలామంది ఖ‌రీదైన ల‌గ్జ‌రీ కార్ల‌పై ఆస‌క్తి చూపిస్తుంటారు. మామూలు కార్ల‌లో లేని సౌక‌ర్యాలు ఉన్న కార్లు వాళ్ల గ్యారేజీల‌లో క‌నిపిస్తుంటాయి. జూనియ‌ర్ ఎన్టీఆర్ సైతం అందుకు మిన‌హాయింపు కాదు. కొత్త‌గా మార్కెట్‌లోకి వ‌చ్చిన ల‌గ్జ‌రీ కార్ల‌ను ఓ చూపు చూస్తుంటాడు తార‌క్‌. లేటెస్ట్‌గా ఆయ‌న దృష్టి 'లంబోర్గిని ఉరుస్' మోడ‌ల్‌పై ప‌డింది. అది అత్యంత వేగంగా వెళ్లే స్పోర్ట్స్ కారు. దానిని ఆయ‌న ఇట‌లీ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాడ‌ని టాలీవుడ్‌లో ప్ర‌చారం జ‌రుగ‌తోంది. ఎందుకంటే ఆ మోడ‌ల్ కారు ప్ర‌స్తుతం ఇండియా మార్కెట్‌లో లేదు. అందుక‌నే ఇట‌లీ నుంచి దాన్ని తెప్పించుకుంటున్న‌ట్లు స‌మాచారం.

అందిన రిపోర్ట‌ల ప్ర‌కారం లంబోర్గిని ఉరుస్ కారు ధ‌ర భార‌తీయ క‌రెన్సీలో రూ. 5 కోట్ల దాకా ఉంటుంది. ట్రాన్స్‌పోర్టేష‌న్‌కూ, టాక్స్‌ల‌కూ మ‌రింత ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. నేడు ప్ర‌పంచంలో అందుబాటులో ఉన్న అత్యంత విలాస‌వంత‌మైన కార్ల‌లో లంబోర్గిని ఉరుస్ ఒక‌టని చెప్తున్నారు. ప్ర‌పంచంలోనే ఇది తొలి సూప‌ర్ స్పోర్ట్ యుటిలిటీ వెహిక‌ల్ అని వినిపిస్తోంది. కేవ‌లం 3.6 సెక‌న్ల వ్య‌వ‌ధిలో జీరో నుంచి గంట‌ల‌కు 62 మైళ్ల వేగాన్ని అందుకొనే సామ‌ర్థ్యం ఈ కారు సొంతం. దీని టాప్ స్పీడ్ గంట‌కు 190 మైళ్లు.

ప్ర‌స్తుతం జూనియ‌ర్ ఎన్టీఆర్ ద‌గ్గ‌ర బీఎండ‌బ్య్లూ కార్లు ఉన్నాయి. ఆయ‌న కార్ల‌న్నింటికీ 9999 అనే ఫ్యాన్సీ నంబ‌ర్ ఉండ‌టం గ‌మ‌నార్హం.