English | Telugu

ఫ‌స్ట్ వీక్ నితిన్ 'చెక్' క‌లెక్ష‌న్లు చాలా వీక్‌!

 

నితిన్ హీరోగా చంద్ర‌శేఖ‌ర్ యేలేటి డైరెక్ట్ చేసిన 'చెక్' సినిమా ఫిబ్ర‌వ‌రి 26న విడుద‌లై, తొలిరోజే బాక్సాఫీస్ ద‌గ్గ‌ర నిరాశాజ‌న‌క వ‌సూళ్ల‌ను సాధించిన విష‌యం తెలిసిందే. వారం పూర్త‌య్యేస‌రికి ఈ సినిమా డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు న‌ష్టాలు క‌లిగించ‌డం దాదాపు ఖాయ‌మైంది. రూ. 14.50 కోట్లు వ‌స్తే బ్రేకీవ‌న్ అవుతుంద‌నంగా, తొలివారం ఈ సినిమాకు వ‌చ్చిన షేర్ రూ. 8 కోట్లు మాత్ర‌మే! అంటే 55 శాత‌మే రిక‌వ‌ర్ అయ్యింది. 

నైజాంలో రూ. 3.18 కోట్లు, ఆంధ్రాలో రూ. 3.9 కోట్లు, రాయ‌ల‌సీమ‌లో రూ. 1 కోటి షేర్‌ను 'చెక్' రాబ‌ట్ట‌గ‌లిగింది. అదే నితిన్ మునుప‌టి సినిమా 'భీష్మ' తొలివారంలోనే బ్రేకీవెన్ సాధించి డిస్ట్రిబ్యూట‌ర్ల‌ను ఆనందంలో ముంచెత్త‌డం గ‌మ‌నార్హం. ఆ సినిమాకు తొలివార‌మే దాదాపు రూ. 23 కోట్ల షేర్ రావ‌డం విశేషం. దీన్ని బ‌ట్టి 'చెక్' మూవీ వ‌సూళ్లు ఎంత తీసిక‌ట్టుగా ఉన్నాయో ఊహించుకోవ‌చ్చు.

క్లైమాక్స్‌లో చేసిన త‌ప్పిదంతో అప్ప‌టిదాకా చెప్పిన క‌థ అంతా బూమ‌రాంగ్ అవ‌డంతో ప్రేక్ష‌కులు 'చెక్‌'ను మెచ్చ‌లేదు. యేలేటి డైరెక్ట్ చేసిన సినిమాల్లోనే ఇది అత్యంత బ‌ల‌హీన స్క్రిప్ట్‌గా విశ్లేష‌కులు తేల్చారు. ర‌కుల్ ప్రీత్ సింగ్‌, ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్‌, ముర‌ళీశ‌ర్మ‌, సంప‌త్ రాజ్ ప్ర‌ధాన పాత్ర‌ధారులైన ఈ సినిమాకు క‌ల్యాణీ మాలిక్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌.