English | Telugu
రూ. 100 కోట్ల మనీ లాండరింగ్ కేసులో టాలీవుడ్ హీరో అరెస్ట్!
Updated : Feb 15, 2021
టాలీవుడ్ హీరో, ముంబైకి చెందిన సచిన్ జోషి రూ. 100 కోట్ల మనీ లాండరింగ్ కేసులో అరెస్టయ్యారు. ఆదివారం ఆయనను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. అనంతరం సచిన్ నివాసం, ఆఫీస్ పరిసరాల్లో ఇన్‌కమ్ టాక్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. మనీ లాండరింగ్ కేసులో దాదాపు రూ. 100 కోట్ల అనుమానిత ట్రాన్‌సాక్షన్లతో కనెక్షన్ ఉందనే ఆరోపణలతో సచిన్ అరెస్టయ్యారు.
శనివారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దర్యాప్తులో భాగంగా ప్రశ్నించే నిమిత్తం సచిన్ జోషిని తీసుకువెళ్లారు. ఆ రోజు రాత్రి వరకు ఏకంగా 18 గంటలపాటు ఇంటరాగేషన్ జరిపారు. జోషి, ఓంకార్ గ్రూప్‌కు మధ్య పలు తప్పుడు డీల్స్ జరిగినట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. ఓ స్థిరాస్తి డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో ఓంకార్ గ్రూప్ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో ఈడీ కేసు నమోదు చేసింది. ఈ వ్యవహారంలో జేఎంజే గ్రూప్‌కు కూడా ప్రమేయం ఉన్నట్లు బయటపడింది. జేఎంజే గ్రూప్ ప్రమోటర్లలో సచిన ఒకరు. సచిన్‌ను ఈ రోజు ముంబైలోని ఓ కోర్టులో హాజరుపరిచారు.
సచిన్ జోషి 2002లో 'మౌనమేలనోయి' చిత్రం ద్వారా టాలీవుడ్‌లో హీరోగా అడుగుపెట్టారు. ఆ తర్వాత ఒరేయ్ పండు, నిను చూడక నేనుండలేను, జాక్‌పాట్, నీ జతగా నేనుండాలి చిత్రాల్లో హీరోగా నటించారు. వీటిలో 'జాక్‌పాట్'లో ఆయన సన్నీ లియోన్ జోడీగా కనిపించారు.