English | Telugu
సునీతపై పిల్లలకు ఎందుకు కోపం వచ్చింది?
Updated : Feb 15, 2021
ప్రముఖ సింగర్ సునీత తన మధురమైన గాత్రంతో ఒకవైపు గాయనిగా, మరోవైపు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గానూ మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నారు. ఆమె పదేళ్ల క్రితం మొదటి భర్త కిరణ్‌తో విడిపోయి ఇద్దరు పిల్లలతో జీవనం సాగిస్తూ వచ్చారు. నెల రోజుల క్రితమే మ్యాంగో మీడియా అధినేత రామ్ వీరపనేనిని ఆమె రెండో వివాహం చేసుకున్నారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రముఖ యాంకర్ వీరిని ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తోంది.
ప్రత్యేక చిట్‌చాట్ సందర్భంగా సింగర్ సునీత పలు ఆసక్తికర విషయాల్ని పంచుకున్నారు. "గత కొంత కాలంగా రామ్ నాకు తెలుసు. అయితే తను ఎప్పుడు ఫోన్ చేసినా అటెండ్ చేసేదాన్ని కాదు. లాక్‌డౌన్ సమయంలో వృత్తిపరమైన విషయాల పరంగా రామ్ ఓ సారి నాకు ఫోన్ చేశారు. 'ఇంకేంటీ.. ఇలాగే వుండిపోతావా?.. పెళ్లి గురించి ఎమైనా ప్లాన్స్ వున్నాయా?' అని రామ్‌ని అడిగాను. దానికి ఆయన 'నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. పరోక్షంగా ఈ విషయాన్ని ఏడేళ్లుగా చెబుతున్నా' అని సమాధానమిచ్చారు. ఇదే విషయంపై మా అమ్మానాన్నలు, పిల్లలతో చర్చించాను. వాళ్లంతా ఎంతో సంతోషించారు.
అదే సమయంలో రామ్ నా గురించి వాళ్లింట్లో చెప్పడం వారు కూడా ఓకే అనడం జరిగిపోయింది. రామ్ వాళ్ల అమ్మానాన్నలతో కలిసి మాట్లాడటానికి తొలిసారి మా ఇంటికి వచ్చారు. అదే సమయంలో నాకు తాంబూలం అందించారు. ఆ ఫొటోతో పాటు నిశ్చితార్థం జరిగిందంటూ నెట్టింట్లో న్యూస్ వైరల్ అయింది. అది తెలిసి మా పిల్లలకు నాపై బాగా కోపం వచ్చింది. 'నీకు ఎంగేజ్‌మెంట్ జరిగిందంట కదా.. ఇంత ముఖ్యమైన విషయం మాకు చెప్పవా?' అంటూ సీరియస్ అయ్యారు. ఆ తరువాత అర్థం చేసుకుని కూల్ అయ్యారు" అని చెప్పారు సింగర్ సునీత.
ఆమెకు మొదటి భర్త ద్వారా ఆకాశ్ అనే కుమారుడు, శ్రేయ అనే కుమార్తె ఉన్నారు. ఆ ఇద్దరూ టీనేజ్ దాటినవాళ్లే కావడం గమనార్హం.