English | Telugu

సుకుమార్‌తో షూటింగ్ ఎలా ఉంటుందో ర‌ష్మిక‌కు తెలిసొచ్చింది!

 

సుకుమార్ ఎంత‌టి క్రియేటివ్ డైరెక్ట‌రో, అంతటి వ‌ర్కోహాలిక్ కూడా. ఆయ‌న ప్ర‌తి సినిమా ప్రేక్ష‌కుల‌కు ఒక స‌రికొత్త అనుభ‌వాన్నీ, అనుభూతినీ ఇస్తుంద‌నేది నిజం. అయితే ఆయ‌న సినిమా సెట్స్‌పై యూనిట్ ప‌డే క‌ష్టాలు మాత్రం మామూలువి కావు. ఒక షాట్ ఓకే చెయ్య‌డానికి సుకుమార్ ఎన్ని టేకులు తీస్తాడో, ఆయ‌న‌తో ప‌నిచేసిన వాళ్లంద‌రికీ అనుభ‌వ‌మే. చాలాసార్లు షాట్ ఓకే చేసినా కూడా ఆయ‌న ముఖంలో శాటిస్‌ఫ్యాక్ష‌న్ క‌నిపించ‌ద‌ని అంటుంటారు. ఒకే సీన్ ప‌దిసార్లు చేయాల్సి వ‌చ్చేస‌రికి యాక్ట‌ర్ల‌తో పాటు టెక్నీషియ‌న్లు కూడా విసుగెత్తిపోతుంటారు. అందుకే సుకుమార్ సినిమా షూటింగ్ అంటే వారంతా హ‌డ‌లిపోతుంటారు. అలా అని ఆయ‌న‌తో ప‌నిచేయ‌కుండా ఉండ‌రు. అది వేరే సంగతి.

లేటెస్ట్‌గా ఆయ‌న షూటింగ్ చేస్తున్న సినిమా 'పుష్ప‌'. అల్లు అర్జున్ హీరోగా న‌టిస్తోన్న ఈ సినిమాలో ర‌ష్మికా మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తోంది. బ‌న్నీ అయితే సుకుమార్‌తో అల‌వాటు ప‌డిపోయాడు కానీ, ర‌ష్మిక‌కు ఆయ‌న‌తో ప‌నిచేయ‌డం ఇదే మొద‌టిసారి. దాంతో సెట్స్‌పై ర‌ష్మిక ప‌డుతున్న తిప్ప‌లు అన్నీ ఇన్నీ కావంటున్నారు.

రోజంతా 'పుష్ప' షూటింగ్‌లో గ‌డిపిన ఆమె, ఇంకా 90 నిమిషాల షూటింగ్ మిగిలే ఉందని చెప్తూ త‌న ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ ఫొటోను షేర్ చేసింది. ఆ ఫొటోలో ర‌ష్మిక క‌ళ్లు మూసుకొని ఉంది. ముఖంలో న‌వ్వు వెనుక బాగా అల‌స‌ట కూడా క‌నిపిస్తోంది. కొద్దిసేప‌టి త‌ర్వాత మ‌రో ఫొటో షేర్ చేసి, అమ్మ‌య్య‌.. ఈ రోజుకు షూటింగ్ అయిపోయింద‌ని చెప్తూ ఊపిరి పీల్చుకుంది.

ఇప్ప‌టికి 'పుష్ప‌'కు సంబంధించి రెండు షెడ్యూల్స్ పూర్త‌యి, మూడో షెడ్యూల్ జ‌రుగుతోంది. అయినా ఇంకా 50 శాతం సీన్లు తీయాల్సి ఉంది. సెట్స్‌పై ర‌ష్మిక అవ‌స్థ‌లు చూసిన‌వాళ్లు ఆమెకు చుక్క‌లు క‌నిపిస్తున్నాయ‌ని చెప్పుకుంటున్నారు. ఆగ‌స్ట్ 13న 'పుష్ప' విడుద‌ల కానున్న‌ది.