English | Telugu
బాలయ్య 'భీష్మ' అవతారం
Updated : Feb 23, 2021
నేడు భీష్మ ఏకాదశి. ఈ సందర్భంగా 'యన్.టి.ఆర్: కథానాయకుడు' చిత్రంలో తాను చేసిన భీష్మ పాత్రకు సంబంధించిన స్టిల్స్‌ను నందమూరి బాలకృష్ణ విడుదల చేశారు. సినిమాలో ఆ పాత్ర మనకు కనిపించని విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ భీష్మ పాత్రంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు. "నాన్నగారు ఆయన వయసుకు మించిన భీష్మ పాత్రను అద్వితీయంగా పోషించి ప్రేక్షకుల విశేష ఆదరాభిమానాలను అందుకున్నారు." అని తెలిపారు.
'భీష్మ' చిత్రమన్నా, అందులో తన తండ్రి ఎన్టీఆర్ నటించిన భీష్ముని పాత్ర అన్నా తనకు చాలా ఇష్టమని బాలయ్య అన్నారు. "అందుకనే 'యన్.టి.ఆర్: కథానాయకుడు' చిత్రంలో భీష్మ పాత్రకు సంబంధించిన సన్నివేశాలు తీశాం. అందులో నేను భీష్మునిగా నటించాను. అయితే నిడివి ఎక్కువ అవడం వల్ల ఆ చిత్రంలో ఆ సన్నివేశాలు పెట్టేందుకు కుదరలేదు. ఇవాళ భీష్మ ఏకాదశి పర్వదినం. ఈ సందర్భంగా ఆ పాత్రకు సంబంధించిన ఫొటోలను ప్రేక్షకులతో, అభిమానులతో పంచుకోవాలని అనుకుంటున్నాను." అని చెప్పారు బాలయ్య.