English | Telugu
"మా ఫ్యామిలీ డిస్టర్బ్ అయ్యింది".. రవికృష్ణతో పెళ్లి రూమర్స్‌పై నవ్య స్వామి!
Updated : Feb 24, 2021
తెలుగు టీవీ తెరపై రవికృష్ణ, నవ్యస్వామి హాట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్నారు. 'ఆమెకథ' సీరియల్‌లో జంటగా నటిస్తోన్న వారిని టీవీ ప్రేక్షకులు ఎంతగానో అభిమానిస్తున్నారు. వారిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీతో పాటు ఆఫ్‌స్క్రీన్ కెమిస్ట్రీ కూడా టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారిపోయింది. ఇద్దరూ ప్రేమలో ఉన్నారనీ, పెళ్లి కూడా చేసుకున్నారనీ కొంతకాలంగా కథనాలు వినిపిస్తున్నాయి.
ఆ మధ్య సుమ యాంకర్‌గా వ్యవహరించే 'క్యాష్' షోలో జంటగా పాల్గొన్నారు రవి, నవ్య. సుమ ఇచ్చిన టాస్క్‌లో భాగంగా రవిని నవ్య ప్రపోజ్ చేయగా, ఆమెను కౌగలించుకొని ముద్దు పెట్టుకున్నాడు రవి. ఈ సీన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతటితో వారి రొమాంటిక్ స్టోరీకి స్టాప్ పడలేదు.
ఇటీవల ఈటీవీలో ప్రసారమవుతోన్న 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోలో జంటగా వచ్చి, ఓ పాటకు పర్ఫామ్ చేసిన రవి, నవ్య మరోసారి అందరి దృష్టిలో పడ్డారు. బ్యూటిఫుల్ కపుల్‌గా అలరించారు. పైగా "ఐ లవ్ యూ" అంటూ నవ్య నుదిటిపై రవి ముద్దు పెట్టుకొన్నాడు. నవ్య కూడా ఊరుకోలేదు. తనూ తిరిగి అతడికి ముద్దిచ్చింది. ఆ తర్వాత ఇద్దరూ ముసిముసి నవ్వులు నవ్వారు. వాళ్ల మధ్య ఉన్న బంధానికి ఈ సన్నివేశం అద్దం పడుతోందని అందరూ అనుకున్నారు.
షూటింగ్‌లో ఉన్నప్పుడు కారవాన్‌లో నుంచి వస్తున్న నవ్యను చూసి నా గుండెగుడిలో పెట్టుకోవాలని అప్పుడే ఫిక్సయిపోయానని రవి చెప్పేశాడు. "అబ్బాయిలెంతమందైనా ఉండోచ్చు.. ఆణిముత్యం మాత్రం ఒక్కడే" అని రవికృష్ణను ఉద్దేశించి చెప్పింది నవ్య. అలా ఒకరిపై ఒకరికి ప్రేమ ఉన్నట్లు ఆ స్టేజిపై ఓపెన్ అయ్యారు. షోలో భాగంగా ఆ ఇద్దరికీ నిర్వాహకులు పెళ్లి కూడా చేసేశారు.
అయితే ఇటీవల ఓ ఇంగ్లీష్ డైలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నవ్య సంచలన వ్యాఖ్యలు చేసింది. రవితో తనకు లవ్ ఎఫైర్ లేదని స్పష్టం చేసింది. తాము నిజంగానే పెళ్లి చేసుకున్నామని చాలా మంది అనుకుంటున్నారని చెప్పింది. కానీ నిజమేమంటే తాము కేవలం ఫ్రెండ్స్ మాత్రమేనని నవ్య తెలిపింది. ఇలాంటి వదంతుల్ని తాను సాధారణంగా పట్టించుకోననీ, కానీ ఈ సారి తన ఫ్యామిలీ ఆందోళన చెందిందని చెప్పింది నవ్య.
"మా అమ్మానాన్నలు ఎంతో సపోర్టివ్‌గా ఉంటారు. కానీ, ఇప్పుడు ఈ ప్రచారం చూపి, మా అమ్మ, 'ఏంటిది? ఏం జరుగుతోంది? మేం నీకు సంబంధాలు చూస్తున్నాం' అని చెప్పింది. 'అదంతా పట్టించుకోకు' అని మా అమ్మకు చెప్పాను. అన్నింటికంటే, ఈ నిరాధార వదంతుల వల్ల మా ఫ్యామిలీస్ చాలా డిస్టర్బ్ అవుతున్నాయి." అని ఆవేదన చెందింది నవ్య. అదీ విషయం.. 'శ్రీదేవి డ్రామా కంపెనీ'లో వాళ్లు చేసిందంతా షోలో భాగమేనని అనుకోవాలన్న మాట!!