English | Telugu
ఆల్ ఈజ్ వెల్.. సుకుమార్ కుమార్తె వోణీ వేడుకలో సూపర్‌స్టార్!
Updated : Feb 25, 2021
డైరెక్టర్ సుకుమార్ కుమార్తె సుకృతి వేణి వోణీ వేడుక బుధవారం రాత్రి హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు టాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్లు హాజరై, సుకృతిని ఆశీర్వదించారు. సూపర్‌స్టార్ మహేశ్- నమ్రత దంపతులు, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్-లక్ష్మీప్రణతి దంపతులు, నాగచైతన్య-సమంత దంపతులు ఈ ఫంక్షన్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
రెండేళ్ల క్రితం మహేశ్, సుకుమార్ మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయనీ, అందుకే సుకుమార్‌తో సినిమా చేయడానికి అంగీకరించి కూడా మహేశ్ దాన్ని వదిలేసుకున్నాడనీ ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగానే తాను ఆ సినిమా చేయట్లేదని మహేశ్ స్వయంగా ప్రకటించినప్పటికీ, ఆ ఇద్దరి మధ్య బంధం తెగిపోయిందని టాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు సుకృతివేణి వోణీ వేడుకకు సతీ సమేతంగా వచ్చి, సుక్కుతో పాటు అతని ఫ్యామిలీతో సరదాగా గడపడం ద్వారా ఆ ప్రచారానికి ముగింపు పలికాడు మహేశ్.
కాగా ఈ వేడుకలో అల్లు అరవింద్ ఫ్యామిలీ, రాజమౌళి ఫ్యామిలీ, జగపతిబాబు, దిల్ రాజు, దేవి శ్రీప్రసాద్, రామ్ పోతినేని, సాయితేజ్, వైష్ణవ్ తేజ్, డైరెక్టర్ బాబీ, నవదీప్, అనుపమ పరమేశ్వరన్, కృతి శెట్టి, సునీత-రామ్ వీరపనేని, సుమ-రాజీవ్ కనకాల, అజయ్, పూరి జగన్నాథ్ భార్య లావణ్య, పిల్లలు ఆకాశ్, పవిత్ర తదితరులు అనేకమంది పాల్గొన్నారు.