English | Telugu
హీరో అంటే వీడురా బుజ్జీ.. పాలాభిషేకాలు చేసే ఫ్యాన్స్ వద్దేవద్దని తేల్చేసిన నాని!
Updated : Mar 28, 2021
స్టార్ల మీద అభిమానుల ప్రభావం ఒకప్పుడు అంతగా ఉండేది కాదు కానీ, ఇప్పుడైతే చాలా మంది స్టార్లు అభిమానుల మీద ఆధారపడుతున్నారనేది నిజం. ఇదంతా సోషల్ మీడియా పుణ్యం. ఫ్యాన్స్ తమ హీరోలను ఆకాశానికెత్తేయడం, ఇతర హీరోలను కించపరుస్తూ నానా యాగీ చెయ్యడం ఇప్పుడు సోషల్ మీడియాలో సర్వసాధారణం. కొంతమందైతే సభ్యతా సంస్కారాలనేవి లేకుండా నీచంగా ట్రోల్ చేస్తుండటం చూస్తున్నాం. ఇలాంటి వాటిని నేరుగా స్టార్లు ఎంకరేజ్ చేయకపోయినా, వారి ముఖ్య అనుచరులుగా, వారి ప్రమోటర్లుగా వ్యవహరించేవారు ఎంకరేజ్ చేస్తుంటారనేది బహిరంగ రహస్యం.
ఒక స్టార్ హీరో సినిమా రిలీజవుతుందంటే ఫ్యాన్స్ చేసే హంగామాకు అదుపూ గిదుపూ ఉండదు. భారీ కటౌట్లు, వినైల్ హోర్డింగ్స్, తోరణాలు, బాణసంచా కాల్పులు.. ఎంత హంగామా చెయ్యాలంటే అంతా చేస్తారు. కటౌట్లకు పాలాభిషేకాలు సరేసరి. కానీ ఓ స్టార్ మాత్రం ఇలాంటి పాలాభిషేకాలను తాను ప్రోత్సహించనని తేల్చి చెప్పేస్తున్నాడు. అవును. ఆ స్టార్.. నాని!
శనివారం 'టక్ జగదీష్' సినిమా పరిచయ వేడుక కార్యక్రమం రాజమండ్రిలో జరిగింది. ఈ వేడుకలో చిత్రంలోని తన ఫ్యామిలీ మెంబర్స్‌గా నటించిన వారి ఒక్కో ఫొటో స్క్రీన్ మీద ప్రత్యక్షమవుతుంటే, సినిమాలో వాళ్ల పాత్రేమిటో, తనకు వారేమవుతారో నాని స్వయంగా పరిచయం చేయడం ఆకట్టుకుంది. చివరగా ఫ్యాన్స్ గురించి మాట్లాడాడు నాని. అభిమానుల గురించి అతను మాట్లాడిన విధానం చూశాక, ఇంకే స్టార్ హీరోకైనా ఫ్యాన్స్ గురించి అలా మాట్లాడే దమ్ము, ధైర్యం ఉన్నాయా అనిపించింది.
"ఈ రోజు చెప్తున్నాను.. నేను ఫ్యాన్స్‌ను ఎంకరేజ్ చెయ్యను. ఇప్పుడే కాదు, ఎప్పటికీ చెయ్యను. ఎందుకు చెయ్యనో తెలుసా? మిగతా వాళ్లు కోరుకున్నట్టు ఫ్యాన్స్ నుంచి నేను కోరుకునేది మీరు అల్లరిచెయ్యడమో, వేరే వాళ్లతో గొడవపడ్డమో, మీరు కటౌట్లు పెట్టడమో, పాలాభిషేకాలు చెయ్యడమో కాదు. మా అమ్మానాన్నల్లాగా మీరందరూ నన్ను చూసి గర్వపడాలని కోరుకుంటున్నాను. మీరు గర్వపడేలా ప్రతిరోజూ కష్టపడుతూనే ఉంటానని మీకు ఈరోజు ప్రామిస్ చేస్తున్నాను." అని చెప్పాడు నాని.
అదీ విషయం. తనకు కటౌట్లు పెట్టడం, పాలాభిషేకాలు చెయ్యడం ఇష్టం లేదని కుండబద్దలు కొట్టేశాడు. అల్లరి చెయ్యడాలు, వేరే ఫ్యాన్స్‌తో గొడవ పడ్డాలు తనకు గిట్టవని తేల్చేశాడు. ఒక్క స్పీచ్‌తో ఇటు ఫ్యాన్స్‌కే కాదు, అటు స్టార్లకూ వాతలు పెట్టేశాడు నాని. అల్లర్లను ప్రోత్సహించే, ఎదుటి హీరోలను ట్రోల్ చేసేలా ఫ్యాన్స్‌ను ఎగదోసే హీరోలకు చెంపపెట్టు లాంటి స్పీచ్ ఇచ్చాడు నాని. అలాగే ఫ్యాన్స్ ఎలా ఉండకూడదో స్పష్టం చేశాడు నాని. తన ఎలాంటి ఫ్యాన్స్‌ను కోరుకుంటున్నాడో కూడా తెలిపాడు. స్టార్ హీరోలు, వారి అభిమానులు నాని మాటలకు ఎలా స్పందిస్తారో చూడాలి.